సింగరేణి పరిరక్షణకు ఐక్యపోరాటాలు
● కోల్‌బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు కలిసిరావాలి ● కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు
గోదావరిఖని: ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం సింగరేణి సంస్థను పరిరక్షించుకుందామని ఐక్య కార్యాచరణ కమిటీ కోరింది. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక సదస్సు నిర్వహించారు. కొత్తగనులు రాకుండా అడ్డుపడటం ద్వారా సింగరేణి మనుగడ లేకుండా చేసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని ధ్వజమెత్తారు. వరుస లాభాలతో నడుస్తున్న సింగరేణి సంస్థ.. కొత్త గనులు ప్రారంభించడానికి, ఉద్యోగాలు ఉపాధిని కల్పించడానికి అడ్డమేమిటని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం, సింగరేణి కార్మిక సంఘాల నాయకులు టి.శ్రీనివాస్ (ఐఎఫ్‌టీ యూ, మాదాసు రామ్మూర్తి(టీజీబీకేఎస్), కామెర గట్టయ్య(తెలంగాణ ఉద్యోగుల సంఘం), రత్నాకర్‌రావు(టీఎన్‌టీయూసీ), రాజమౌళి (ిసీఐటీయూ), కె.విశ్వనాథ్ (ఐఎఫ్‌టీయూ), ఎ.రాములు(ఏఐఎఫ్‌టీయూ), తోకల రమేశ్(టీయూసీఐ) నాయకులు ప్రశ్నించారు. సింగరేణిని రక్షించుకునేందుకు, కార్మికుల హక్కులను కాపాడేందుకు కొత్త ఉద్యోగాలను సాధించుకునేందుకు, కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు అమలు చేసేందుకు ఐక్యపోరాటాల కు సిద్ధం కావాలని వారు కోరారు. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు సంస్థను బతికించుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. గోదావరి లోయ ప్రాంతా ల్లో నేటికీ అపారమైన బొగ్గునిక్షేపాలు ఉన్నాయని, వాటిని వెలికితీసేందుకు పూనుకోవాలని అన్నారు. సింగరేణిని బతికించుకోవడం, గని కార్మికులకే కాకుండా రిటైర్డ్ కార్మికులు, గోదావరి తీర ప్రాంతంలోని ప్రజానీకం.. తెలంగాణ ప్రజలు ‘సింగరేణి బచావ్ఙో’ఉద్యమంలో పాల్గొనాలని వారు కోరారు.


