తెలంగాణ ప్రాజెక్టు పనుల ప్రగతిపై సమీక్ష
జ్యోతినగర్(రామగుండం): సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సభ్యుడు, ఎన్‌టీపీసీ రిటైర్డ్ డైరెక్టర్ వి.రమేశ్‌బాబు శనివారం రామగుండంలోని ఎస్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈడీ చందనకుమార్ సమంత, హెచ్‌ఆర్ ఏజీఎం బీజయ్‌కుమార్ సిక్ధర్‌తో పాటు పలువురు జీఎంలు ఆయనకు ఘనస్వాగతం పలికారు, ప్రాజెక్టు వద్ద నిర్మించిన సీఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ భవనాన్ని రమేశ్‌బాబు ప్రారంభించారు, అనంతరం తెలంగాణ ప్రాజెక్ట్ స్విచ్ యార్డ్‌ను సందర్శించారు. ప్రాజెక్టులో చేపట్టిన పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల జనరల్ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.
13లోగా పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 13వ తేదీలోగా ఫీజు చెల్లించాలని డీఈవో మాధవి తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాలన్నారు. ఫెయిలైనవారు 3 సబ్జెక్టుల వరకు రూ.110, అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులు ఉంటే రూ.125 చెల్లించాలని పేర్కొన్నారు. సకాలంలో చెల్లించని విద్యార్థులు రూ.50 అపరాధ రుసుంతో నవంబర్ 29 వరకు, రూ.200 పెనాల్టీతో డిసెంబర్ 11వరకు, రూ.500 లేట్‌ఫీజుతో డిసెంబర్ 29 వర కు ఫీజు చెల్లించవచ్చని వివరించారు. అదనంగా ఫీజు వసూలు చేసినట్లు తన దృష్టికి వస్తే శాఖాపరమైన చర్యలుంటాయని డీఈవో హెచ్చరించారు.


