ఇంకుడు గుంతలు నిర్మించాలి
కోల్‌సిటీ(రామగుండం): భూగర్భ జలసంరక్షణలో భాగంగా ఇంటింటా ఇంకుడుగుంత నిర్మించుకునేలా ప్రజలను చైతన్యపరచాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో గురువారం ఆమె సమావేశమయ్యారు. జలశక్తి అభియాన్‌లో భాగంగా నగరంలో డిసెంబర్ 31వ తేదీ వరకు 10 వేల ఇంకుడుగుంతలు నిర్మించడం లక్ష్యంగా నిర్దేశించామని ఆమె తెలిపారు. వార్డుఆఫీసర్లు, సహాయకులు, ఆర్పీల సహకారంతో ఇంటింటా సర్వే చేయాలన్నారు. ఇంకుడుగుంతలు ఉన్నవి, లేని ఇళ్ల వివరాలు, ఆ ఇంట్లో నిర్మించడానికి అవకాశం ఉందా? లేదా? అనే సమాచారం ఈనెలాఖరులోగా సేకరించి ఇవ్వాలని ఆదేశించారు. అవకాశం ఉన్నచోట నగరపాలక సంస్థ ద్వారా ఇంకుడుగుంత నిర్మిస్తుందని కమిషనర్ అన్నారు. స్వయంగా నిర్మించుకోవడానికి యజమాని ముందుకు వస్తే ఆస్తిపన్నులో 10 శాతం రాయితీకి అర్హులవుతారని అవగాహన కల్పించాలని అన్నారు. న ల్లా కనెక్షన్ వివరాలు అమృతం యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎన్టీపీసీ హెలిపాడ్ ట్యాంక్ పరిధిలో త్వరలో 24 గంటల పాటు తాగునీరు సరఫరా చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజినీర్ గురువీర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, కార్యదర్శి ఉమామహేశ్వర్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి, ఆర్వో ఆంజనేయులు పాల్గొన్నారు.
నగరంలో నిర్దేశిత లక్ష్యం 10 వేలు
రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ వెల్లడి


