ఖనిలోనే కీమోథెరపీ
కోల్‌సిటీ(రామగుండం): అనేక దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలు ఎట్టకేలకు కేన్సర్ బాధితుల చెంతకు చేరాయి. అనేక పరిశ్రమలకు నిలయమైన రామగుండం పారిశ్రామిక ప్రాంతంతోపాటు జిల్లాలోని వివిధ మండలాల్లో అనేకమంది కేన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వాతావరణ కాలుష్యం, పరిశ్రమల్లోంచి వెలువడే రసాయన వ్యర్థాలు, ఇతరత్రా కారకాలతో జిల్లాలో కేన్సర్ బారినపడేవారి సంఖ్య ఏటా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. వీరికి కరీంనగర్, హైదరాబాద్‌లోనే కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలు అందుబాటులో ఉంటున్నాయని అంటున్నారు. సామాన్యులు, పేదలు అంతదూరం వెళ్లి చికిత్స పొందడం ఆర్థిక ప్రయాసలతో కూడుకున్నది. ఈ నేపథ్యంలోనే గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో గురువారం కేన్సర్ బాధితులకు చికిత్స ప్రారంభించడంతో సర్వత్రా హర్షం వ్యకమవుతోంది.
రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ..
ప్రభుత్వం రాష్ట్రంలోని పలు సర్కార్ ఆస్పత్రుల్లో కేన్సర్ డే కేర్ సెంటర్లను ఏర్పాటుచేయగా.. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెడికల్ సూపరింటెండెంట్ దయాళ్‌సింగ్ సేవలను గురువారం ప్రారంభించారు. ఓ పేషెంట్‌కు డే కేర్ సెంటర్ ఇన్‌చార్జి, జనరల్ సర్జన్ ఫరీద్ పర్యవేక్షణలో అనెస్థీషి యా ఇర్ఫాన్ నేతృత్వంలో చికిత్స అందించడం ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అరుణ, ఆర్‌ఎంవో రాజు, నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. కేన్సర్ డే కేర్ సెంటర్ సేవలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ గతనెల రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రారంభించారు.
ఉదయం వచ్చి.. సాయంత్రం వెళ్లొచ్చు..
కేన్సర్ డే కేర్ సెంటర్ ద్వారా పేషెంట్లకు కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ వంటి కీలకమైన సేవలు అందిస్తున్నారు. ఉదయం వచ్చి చికిత్స పొంది సాయంత్రం ఇంటికి వెళ్లవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.
మధ్యలో ఆపివేస్తే ముప్పే..
కేన్సర్ బాధితులు చికిత్సను మధ్యలో ఆపివేస్తే వ్యాధి మళ్లీ దాడిచేసే ప్రమాదం ఉంది. రేడియేషన్, కిమోథెరపీ, మందుల వినియోగం క్రమంతప్పకుండా వాడుకుంటూ ఉండాలి. పల్లెవాసులు అవగాహన లేక దూరభారంతో హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లలేక మధ్యలోనే చికిత్స ఆపేస్తున్నారని వైద్యులు వివరిస్తున్నారు. ఇలాంటి వారికి జీజీహెచ్‌లోని డే కేర్ సెంటర్ ఎంతో ఊరటనిస్తుందని వారు పేర్కొంటున్నారు.
జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు కేటాయింపు..
జీజీహెచ్‌లో కేన్సర్ డే కేర్ సెంటర్ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. జిల్లానుంచి వచ్చే పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా 25 వరకు పడకల వరకు పెంచనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
వైద్యులకు శిక్షణ..
పేషెంట్లకు చికిత్స అందించడానికి జీజీహెచ్‌లోని జనరల్ సర్జన్ ఫరీద్, అనెస్థీషియా ఇర్ఫాన్‌కు డీఎంఈ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అవసరమైన మందులు కూడా సరఫరా చేశారు.
ఎంఎన్‌జే రెఫరల్ ఆధారంగానే..
హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో తొలుత పేషెంట్‌కు వ్యాధిని నిర్ధారణ చేస్తారు. తొలి కిమోథెరపీ చేస్తారు. ఆ తర్వాత అవసరమైన కీమోథెరపీలను జీజీహెచ్‌లోని డే కేర్ సెంటర్‌లో అందిస్తారు. ఇందుకోసం అన్ని వైద్య పరీక్షలు చేస్తారు. అనుకూలంగా లేని పీషెంట్లను హైదరాబాద్ కేన్సర్ ఆస్పత్రికి పంపించనున్నారు.
జీజీహెచ్‌లో ప్రత్యేక సెంటర్
వినియోగంలోకి వచ్చిన సేవలు
కేన్సర్ బాధితులకు భారీ ఊరట
25 పడకల వరకు పెంచే యోచన
ఖనిలోనే కీమోథెరపీ


