చలికాలం.. భద్రం
● జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యం ● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వాణిశ్రీ
పెద్దపల్లి: వానాకాలం ముగిసింది. చలికాలం ఆరంభమైంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రజలు.. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, శ్వాసకోశ, గుండె సంబంధిత తదితర వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటా రని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వాణిశ్రీ వివరిస్తున్నారు.
చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
డీఎంహెచ్‌వో : చిన్నపిల్లలు, వృద్ధులు తప్పనిసరిగా షట్టర్లు, దుప్పట్లు ధరించాలి. పిల్లల ఆరోగ్యగంపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. ఉదయం లేవగానే చలిలో ఉండొద్దు.
ఉదయం లేవగానే ఏం చేయాలి?
డీఎంహెచ్‌వో : అన్ని వయసులవారు మార్నింగ్ వాకింగ్ చేయడం మంచిది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే శరీరం పొడిబారదు.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో : ప్రతీరోజు వేడిగా ఉన్న అన్నం,కూరలు తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, సూప్‌లు తీసుకోవాలి.
ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది?
డీఎంహెచ్‌వో : చలికాలంలో జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, జ్వరం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
వృద్ధులకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయా?
డీఎంహెచ్‌వో : చలితీవ్రతకు శరీరంలోని రక్తం చిక్కబడుతుంది. ఇది వృద్ధుల్లో ఎక్కువగా ఉంటుంది.
ఆస్తమా బాధితులు ఏం చేయాలి?
డీఎంహెచ్‌వో : ఆస్తమా బాధితులు చలికాలంలో చాలాజాగ్రత్తలు తీసుకోవాలి. దుమ్ము, ధూళిలో తిరగవద్దు. ఇన్‌హేలర్ అందుబాటులో ఉంచుకోవాలి.
న్యుమోనియా బారినపడేవారెవరు?
డీఎంహెచ్‌వో : పిల్లలు, వృద్ధులు న్యుమోనియా బారిన పడే అవకాశం ఉంది. వీరు చల్లని వాతావరణంలో ఎక్కువసేపు ఉండొద్దు. మంచు కురిసే ఉదయం, రాత్రి వేళలో బయటకు వెళ్లవద్దు. ఈ వ్యాధి బారిన పడకుండా పిల్లలకు టీకా వేయించాలి.
చాలామంది ఇంటి వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు?
డీఎంహెచ్‌వో : ఇంటి వైద్యం ప్రాణాంతకం. వైద్యుల పర్యవేక్షణలోనే తగిన చికిత్స తీసుకోవాలి.
వ్యాధి నిరోధక శక్తి ఎలా పెరుగుతుంది?
డీఎంహెచ్‌వో : నిమ్మలో సి– విటమిన్ అధికంగా ఉంటుంది. ఇలా విటమిన్‌లు ఉండే పండ్లు తినాలి. తద్వారా వ్యాధి రోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు.. తగినంత తాగునీరు తీసుకోవాలి. ఫ్రిజ్‌లో నిల్వచేసిన ఐస్, ఐస్ క్రీమ్ తినవద్దు. పల్లిపట్టి, శరీరానికి వేడిచేసే పదార్థాలు మాత్రమే చలికాలంలో తీసుకోవడం మంచిది.
చలికాలం.. భద్రం


