
భక్తులూ.. జరభద్రం
కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలో శుక్రవారం నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన సమయంలో అప్రమత్తంగా ఉండకపోతే అపశ్రుతులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.
వాగులు, వంతెనల వద్ద భద్రం...
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నదులు, చెరువులు, వాగులు నిండిపోయి పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో గణనాథులను నీటిలో నిమజ్జనం చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పట్టుతప్పి నీటిలో పడిపోయే ప్రమాదం ఉంది. నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. విగ్రహాలకు అడ్డుగా ఉన్న తీగలను చేతులతో పట్టుకోవద్దు. వైరును పైకి ఎత్తేందుకు ఎండిన కర్రను ఉపయోగించాలి.
వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలి
నిమజ్జన శోభాయాత్రలో వినాయక ప్రతిమలను ఊరేగించే వాహనాల డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి. కండీషన్ కలిగిన వాహనాలను మాత్రమే ఎంచుకోవాలి. అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్ల ను మాత్రమే ఎంచుకోవాలి. డ్రైవర్లు మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
సూచనలు పాటించాలి
నిమజ్జన సమయంలో అధికారిక యంత్రాంగం ఏర్పాటు చేసిన క్రేన్లు, తదితర వాటి సమీపంలోకి వెళ్లకూడదు. పోలీసులు, మున్సిపల్‌తోపాటు సంబంధిత అధికారులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు, సిబ్బంది సూచనలు పాటించాలి. పోలీసులు, నిమజ్జనం చేసే నిర్వాహకుల హెచ్చరికలను కాదని నది, చెరువులు, కుంటలు, వాగుల్లోకి వెళ్లేందుకు సాహసం చేయొద్దు. ఈతరాని వారు, పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి వెళ్లకుండా చూసుకోవాలి.