వరద బిరబిరా.. ప్రాజెక్టులు కళకళ | - | Sakshi
Sakshi News home page

వరద బిరబిరా.. ప్రాజెక్టులు కళకళ

Aug 31 2025 8:04 AM | Updated on Aug 31 2025 8:04 AM

వరద బిరబిరా.. ప్రాజెక్టులు కళకళ

వరద బిరబిరా.. ప్రాజెక్టులు కళకళ

ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటిమట్టం(టీఎంసీల్లో)

ప్రాజెక్టు రిపోర్ట్‌

గరిష్ట స్థాయికి ఎల్లంపల్లి, మధ్య, దిగువ మానేరు డ్యాంలు

మోయతుమ్మెద, మూలవాగుల నుంచి ఎల్‌ఎండీకి తగ్గిన వరద

ఎల్లంపల్లి ఇన్‌ఫ్లోలో అనూహ్యంగా పెరిగిన వరద

క్రమంగా దిగువకు నీటిని నిలిపివేస్తున్న అధికారులు

వేసవి వరకు సాగు, తాగునీటికి ఇబ్బంది లేదంటున్న అధికారులు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు గరిష్ట నీటిమట్టానికి చేరుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి, మానేరు మీద నిర్మించిన ఎగువ, మధ్య, దిగువమానేరు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటితో కళకళలాడుతున్నాయి. కామారెడ్డి ఎగువ ప్రాంతాలు, ఎస్సారెస్పీ, వరద కాలువ నుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో మానేరు ప్రాజెక్టుల నుంచి దిగువనకు నీటి విడుదల నిలిపివేశారు. ఎగువమానేరు పూర్తిస్థాయి నీటి మట్టం 2టీఎంసీలు కాగా, ప్రస్తుతం అదేస్థాయిలో నీటిమట్టం ఉంది. ప్రాజెక్టులోకి 5,798 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 5,798 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టుకు కీలకమైన మూలవాగు, వరద కాలువ, మానేరు నదుల నుంచి ఇప్పటికీ 20వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. మొన్న వర్షాల సమయంలో ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. 12,930 క్యూసెక్కుల ఔట్‌ఫ్లోను దిగువకు వదులుతున్నారు. లోయర్‌మానేరు డ్యాంకు ఇన్‌ఫ్లో దాదాపుగా నిలిచిపోయింది. నిన్న మొన్నటి వరకు 50వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో మిడ్‌మానేరు నీటిని నిలిపేయగానే 293 క్యూసెక్కులకు పడిపోయింది. మోయతుమ్మెద, మానేరు నది నుంచి వరద నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన నేపథ్యంలో వానాకాలం, యాసంగి వరకు వ్యవసాయానికి ఇబ్బంది లేదని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఎల్లంపల్లికి పొటెత్తిన వరద

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద అనూహ్యంగా పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి గోదావరికి వరదపోటు పెరగడమే ఇందుకు కారణం. బుధవారం వరకు 5 లక్షల క్యూసెక్కుల వరకు వచ్చిన వరద.. అనూహ్యంగా ప్రస్తుతం 7,60,652 క్యూసెక్కులకు పెరిగింది. కాగా 7,35,847 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 13.33 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుతున్నారు. రెండేళ్ల క్రితం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నిల్వ ఉన్న సమయంలో ఎగువ నుంచి ఆకస్మికంగా భారీస్థాయిలో వచ్చిన వరదతో గోదావరిఖని పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. అందుకే, 13 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచి 62 గేట్లకుగాను 37 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి ప్రస్తుతం

ఎగువమానేరు 2 2

మధ్యమానేరు 27 25

లోయర్‌మానేరు 24 21

ఎల్లంపల్లి 20 13

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement