
ఆపరేషన్లు విజయవంతం
సేవలు ఉచితం..
● పెద్దపల్లిలోనే కంటి ఆపరేషన్లు ● కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సేవలు ● దూరప్రాంతాల నుంచి కూడా తరలివస్తున్న పేషెంట్లు ● శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ
పెద్దపల్లిరూరల్: మానవ శరీరంలోని అవయవాలు అన్నింటిలోనూ కళ్లు అత్యంత ప్రధానమైనవి. మనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటానికి ఇవే మూలకారణం. అలాంటి నేత్రాలు సమస్యల్లో చి క్కుకుంటే.. కార్పొరేట్‌స్థాయికి మించి నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు స్థానిక ప్రభుత్వ వైద్యులు. పేదలకు ఇలాంటి ఖరీదైన వైద్యసేవలను అందుబాటులోకి తేవాలనే కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైంది. కంటి సమస్యలతో ఆస్పత్రికి వచ్చేవారికి శస్త్ర చికిత్సలు అవసరమైతే కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని గుర్తించి, జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోనే కంటి ఆపరేషన్లు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అవసరమైన పరికరాలు సమకూర్చారు. ఆర్నెల్ల క్రితమే ఆపరేషన్ థియేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్నుంచి జిల్లా ఆస్పత్రిలోనే అవసరమైన వారంరికీ కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. ఆపరేషన్లు వందశాతం విజయవంతమవుతుండడంతో జిల్లా ప్రజలే కా కుండా పొరుగు జిల్లాల నుంచి కూడా బాధితులు ఇక్కడికి ఆపరేషన్ల కోసం భారీగా తరలివస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించేందుకు లయన్స్‌క్లబ్ ప్రతినిధులు కూడా ముందుకొచ్చారు. దీంతో పేదలకు పైసా ఖర్చులేకుండా ఉచితంగా కంటి ఆపరేషన్లు సాగుతున్నాయి.
స్వచ్ఛంద సంస్థల సహకారంతో..
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేయకముందు కంటి సమస్యలతో బాధపడే పేషెంట్లు శస్త్రచికిత్సల కోసం లయన్స్‌క్లబ్, ఇతర స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలపై ఆధారపడేవారు. అందులో కంటి ఆపరేషన్ తప్పనిసరని నిర్ధారిస్తే.. సుదూరంలోని రేకుర్తి కంటి ఆస్పత్రికో, లేదా, కరీంనగర్‌లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆపరేషన్లు చేయించుకునేవారు. ఇందుకోసం అధిక వ్యయప్రయాసలు పడేవారు.
ఆరు నెలలుగా ఇక్కడే సేవలు..
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఈ ఏడాది జనవరి నుంచి కంటి ఆపరేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది అక్టోబర్‌లోనే ఆపరేషన్లకు అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలు చేసినా.. అవసరమైన గది అందుబాటులోకి రాలే దు. ఆ తర్వాత దానిని అందుబాటులోకి తీసుకొచ్చి జనవరి నుంచి శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రతీనెల కనీసం 100 వరకు కంటి ఆపరేషన్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఉచితంగానే కళ్లద్దాలు కూడా అందించేందుకు లయన్స్‌క్లబ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది.