
పట్టుకోసం టీబీజీకేఎస్ వ్యూహం
● పూర్వవైభవం సాధించడమే లక్ష్యం ● ఇన్‌చార్జి కొప్పుల ఈశ్వర్ నజర్
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో పూర్వవైభవం సాధించడం లక్ష్యంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ముమ్మ ర ప్రయత్నాలు చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్, ఆ దిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి న ఈ సంస్థలో సుమారు 40 వేల మంది పర్మినెంట్, మరో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తుండగా, ఇందకో 30వేల మంది వరకు పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. వీరి సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, యాజమాన్యంతో సమన్వయం కోసం గుర్తింపు కార్మిక సంఘంగా వ్యవహరించిన సమయంలో అనేక పోరాలు చే సింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో అనే క ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.
‘గుర్తింపు’ ఎన్నికలు టార్గెట్‌గా..
సింగరేణిలో పట్టు సాధించడం, ఆ తర్వాత వచ్చే గుర్తింపు కార్మిక సంఘం, అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురేయాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే యూనియన్ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి, సింగరేణి కార్మిక వారసుడైన కొప్పుల ఈశ్వర్‌కు ఇటీవల బాధ్యతలు అప్పగించారు.
పోటీనుంచి తప్పుకుని.. మళ్లీ తహతహ..
2023 డిసెంబర్ 27 జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ నుంచి అకస్మాత్తుగా తప్పుకుంది. దీంతో కీలక నేత లు ఇతర యూనియన్లకు వలసబాట పట్టగా, యూనియన్ నీరుగారిపోయింది. ఇదేఅదనుగా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ప్రచారంలో దూ సుకెళ్లాయి. దీంతో ఏఐటీయూసీ గుర్తింపు కార్మి క సంఘంగా, ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా విజయం సాధించాయి. అప్పటినుంచి బీఆర్‌ఎస్ అధిష్టానం యూనియన్‌పై పెద్దగా ఆసక్తిచూపలేదు. టీబీజీకేఎస్ కార్యకలాపాలు కూడా సాగిన దాఖలాలు కనిపించలేదు. కొంతకాలం తర్వాత యూనియన్ అధ్యక్షుడిగా మిర్యాల రాజిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య నేతలతో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించారు.
కల్వకుంట్ల కవిత అరంగేట్రం..
ఎమ్మెల్సీ కవిత సింగరేణిలో జాగృతి సైన్యం పేరిట ఇటీవల డివిజన్ ఇన్‌చార్జిలను నియమించింది. జాగృతి, టీబీజీకేఎస్‌లోని తనకు అనుకూలమైన కొందరు నేతలతో ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఏరియా ఇన్‌చార్జిలనూ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
టీబీజీకేఎస్ నేతలతో కేటీఆర్ భేటీ..
ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోల్‌బెల్ట్‌లోని మాజీ ప్రజాప్రతినిధులు, యూనియన్ ముఖ్య నేతలతో ఇటీవల సమావేశమయ్యారు. యూనియన్ బలోపేతంపై చర్చించి టీబీజీకేఎస్ ఇన్‌చార్జిగా కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు. ఇప్పటివరకు గౌరవ అధ్యక్షురాలిగా కవిత ఉండగా.. ఈశ్వర్‌ను ప్రకటించి యూనియన్‌కు పూర్వవైభవం తేవా లని నేతలను సూచించడం చర్చకు దారితీసింది.
పెరిగిన నిర్బంధం..
యూనియన్ ఇన్‌చార్జిగా నియమితులై తొలిసారి గోదావరిఖని పర్యటనకు వచ్చిన కొప్పుల ఈశ్వర్.. ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం సమావేశమయ్యారు. ఆత్మీయ సన్మానం పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యే నాయకులపై పోలీసు నిర్బంధం పెంచారని ఈశ్వర్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. టీబీజీకేఎస్ నేతలను అక్రమంగా బదిలీ చేశారని, వాటిని రద్దు చేయాలని, ఇదేవిషయంపై కోల్‌బెల్ట్ మాజీ ఎమ్మెల్యేలతో సింగరేణి సీఎండీని కలిసి విన్నవిస్తామన్నారు. అంతేకాదు.. యూనియన్ బలోపేతానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించడం ద్వారా యూనియన్‌నుకు పూర్వవైభవం తేవాలని యోచిస్తున్నారు. మరోవైపు.. స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ.. యూనియన్ శ్రేణుల్లో చైతన్యం తెచ్చి బీఆర్‌ఎస్‌నూ కోల్‌బెల్ట్‌లో పటిష్టం చేయాలని కేటీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇంటిపోరు, మరోవైపు బయటి పోరుకు చెక్‌పెట్టేలా సింగరేణి నుంచి కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.