
బీసీ బిల్లు అమలు కావొద్దని కుట్ర
కరీంనగర్ కార్పొరేషన్: బీసీ బిల్లు అమలు కావొద్దని కుట్ర పెట్టుకొని, కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తే వారికి పుట్టగతులు ఉండవని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని, అడ్డొస్తే బీసీలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. శనివారం కరీంనగర్‌లో మాట్లాడుతూ కడుపులో కత్తులు పెట్టుకొని పైకి కౌగిలించుకున్నట్లుగా బీఆర్‌ఎస్ వ్యవహారం ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా లక్షమందితో కులగణన చేపట్టిందన్నారు. సర్వేలో పాల్గొనని వారికి బీసీ బిల్లు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నుంచి రాష్ట్రపతికి బిల్లు పంపడం వరకు తాము చిత్తశుద్ధితో వ్యవహరించామన్నారు. 42శాతం రిజర్వేషన్ల అమలుకు అడ్డంకులు వస్తే ఆర్డినెన్స్ తెచ్చి సవరిస్తున్నామని తెలిపారు. నడిచేవాళ్ల కాళ్లలో కట్టె అడ్డం పెట్టినట్లుగా బీఆర్‌ఎస్ తీరు ఉందని విమర్శించారు. బీసీలపై ప్రేమ ఉంటే రాష్ట్రపతి వద్ద బిల్లు ఆమోదం పొందేలా తమతో కలిసి రావాలని బీఆర్‌ఎస్‌కు సూచించారు. మంత్రి వెంట చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఉన్నారు.
కడుపుల కత్తులు పెట్టుకొని పైకి నటిస్తున్నారు
బీఆర్‌ఎస్‌పై మంత్రి ‘పొన్నం’ ధ్వజం