
పడిపోయిన సన్నబియ్యం ధరలు
● పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలో సన్నబియ్యం ధరలు గణనీయంగా తగ్గాయి. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటను కలిగించినట్లయ్యింది. గతంలో క్వింటాల్ ధర రూ.5,000 నుంచి రూ.6,000 వరకు పలికిన ధర.. ఇప్పుడు రూ.4,500 నుంచి రూ.4,000కు పడిపోయింది.
ధరల తగ్గుదలకు కారణాలు..
రాష్ట్రప్రభుత్వం ఇటీవల సన్నవడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. అంతేగాకుండా, రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఫలితంగా ధరలు పడిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకంతో సన్నవడ్ల సాగు విస్తీర్ణం, దిగుబడి పెరుగుతోంది. ఇది మార్కెట్‌లో సన్న బియ్యం ధరల తగ్గుదలకు దారితీస్తోందంటున్నారు.
రేషన్‌కార్డు లేనివారికి ప్రయోజనం
జిల్లాలో సుమారు 35వేల కుటుంబాలకు రేషన్‌కార్డులు లేవని అధికారులు చెబుతున్నారు. వీరికి ప్రతినెలా దాదాపు 10 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమంటున్నారు. ఇప్పుడు ధరలు తగ్గడంతో వీరికి ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.