
స్పందిస్తున్న హృదయాలు
● అజయ్‌కి అండగా ఆరోగ్యశాఖ మంత్రి
● మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలింపు
వీణవంక: వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన సుద్దాల అజయ్ వినాయక విగ్రహాల తయారీకేంద్రంలో గాయపడి అచేతనస్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్‌కు రూ.10లక్షలు ఖర్చవుతుండటంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడటంపై ‘సాక్షి’లో బుధవారం ‘నిరుపేదకు పెద్ద కష్టం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ సంఘటనపై సీఎంవో కార్యాలయం, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కార్యాలయం నుంచి ఆరా తీశారు. అజయ్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి వాకాబు చేశారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అజయ్‌కి మెరుగైన వైద్యం అందించాలని వరంగల్ జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేయడంతో హుటాహుటిన అజయ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు. దగ్గరుండి నిమ్స్‌కు తరలించారు. కాగా.. పలువురు దాతలు ఇప్పటి వరకు రూ.1.20 లక్షల సాయం అందించారు.
ఎమ్మెస్సార్ సతీమణి సుగుణ మృతి
కరీంనగర్: దివంగత మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు సతీమణి మేనేని సుగుణ(85) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతి చెందారు. వారి అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో గురువారం మధ్యాహ్నం 12గంటలకు జరుగనున్నాయి. ఎమ్మెస్సార్ సతీమణి సుగుణదేవి మరణం బాధకరమని ఎంఐంఎ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తదితరులు ఒక ప్రకటనలో నివాళి అర్పించారు.