
రక్షణ దుస్తులు ధరించి పనిచేయాలి
● రామగుండం బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి ● పారిశుధ్య సిబ్బందికి సేఫ్టీపై అవగాహన
కోల్‌సిటీ(రామగుండం): పారిశుధ్య సిబ్బంది విధి నిర్వహణలో వ్యక్తిగత రక్షణ దుస్తులు, పరికరాలు తప్పనిసరిగా ఉపయోగించాలని రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి సూచించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతోపాటు ‘నమస్తే డే (నేషనల్ యాక్షన్ పర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ డే)’ను పురస్కరించుకొని పారిశుధ్య సిబ్బందితో నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం అవగాహన కల్పించారు. సఫాయి మిత్రలకు ప్రభుత్వం ఆయుష్మాన్ హెల్త్ కార్డులు అందజేస్తూ మరో రూ.5లక్షలు అదనపు బీమా కవరేజ్ కల్పిస్తున్నదని తెలిపారు. ఈ పథకం వర్తించడానికి డాక్యుమెంట్లతో పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. అంతకుముందు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో చేపట్టిన వివిధ పనులను ఆయన పర్యవేక్షించారు. ద్వారకా నగర్‌లో స్లమ్ సమాఖ్య సమావేశంలో పాల్గొని తడి, పొడి చెత్త, రీసైక్లింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సప్తగిరి కాలనీలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛతపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. రామగుండం హౌసింగ్ బోర్డ్ కాలనీలో పిచ్చిచెట్లు, పొదలు తొలగించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కుమారస్వామి, కిరణ్, నాగభూషణం, ఆర్‌ఐ శంకర్‌రావు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.