
పల్లెపెద్ద పెత్తనం
సాక్షి, పెద్దపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో వివాదాలను సులభంగా, తక్కువ ఖర్చుతో త్వరితగతిన పరిష్కరించేందుకు కుల సంఘాల ప్రతినిధులు, పెద్దమనుషుల పంచాయితీలు ఉపయోగపడుతున్నాయి. పెద్దలు చేస్తున్న ఇలాంటి పంచాయితీలు అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాయి.. ఇదేసమయంలో గొడవలకూ దారితీస్తున్నాయి. మరికొన్ని సందర్భా ల్లో ప్రాణాలు తీసుకునే స్థాయికీ తీసుకెళ్తున్నాయి.
సిఫారసులే కారణమా?
సమస్యల పరిష్కారం కోసం ఠాణామెట్లు ఎక్కుతున్న బాధితులకు పెద్దమనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలని పోలీసులు సలహా ఇస్తున్నారని, దీంతోనే అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కులం, లింగం, ఆర్థికస్థితి, వ్యక్తిగత సంబంధాల ఆధారంగా పెద్దమనుషులు పక్షపాతంగా వ్య వహరించడం, మహిళలపై వివక్ష, అధికార దుర్వినియోగం, చట్టంపై అవగాహనలోపంతోనూ చాలా పంచాయితీలు దారితప్పుతున్నాయని అంటున్నా రు. కొన్ని సందర్భాల్లో కులబహిష్కరణలకూ తీర్మానాలు చోటుచేసుకుంటున్నాయి. లోక్ అదాలత్, కో ర్టుల్లో తేల్చుకోవాల్సిన ఆర్థికపరమైన వివాదాలు, కుటుంబాల సమస్యల పరిష్కారాల కోసం ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించిన సమస్యలూ గొడవలకు దారితీస్తూ హింసను ప్రేరేపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అడ్డాలుగా గ్రామశివారు ప్రాంతాలు
కుటుంబ, భార్యాభర్తల పంచాయితీలు, ఇతర వివాదాల్లో ఇరువర్గాలు సమస్యను పరిష్కరించుకునేందుకు గ్రామాల్లోని మార్కెట్ యార్డులు, పొలం గట్లు, నిర్మానుష్య ప్రదేశాలు, శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నాయి. అక్కడ ఎలాంటి ఘటన జరిగినా వెంటనే పోలీసులు చేరుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈక్రమంలోనే ఇరువర్గాలు మాటామాటా పెంచుకుని విచక్షణ కోల్పోతూ భౌతికదాడులకు దిగుతున్నాయి.
వీడీసీల ఆగడాలు కూడా..
జిల్లాలోని వివిధ పల్లెల్లో గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ)ల ఆగడాలు మితిమీరుతున్నాయి. కొంతకాలంగా పెద్దరికం పేరిట అక్రమ వ్యాపారులనూ ప్రోత్సాహిస్తున్నాయి. తమ తీర్పులు, తీర్మానాలను ధిక్కరించే వారిపై బహిష్కరణ వేటువేస్తున్నాయి. అన్ని కులాలకు చెందిన ఒక్కో వ్యక్తి ఈ వీడీసీల్లో సభ్యుడిగా ఉంటున్నారు. గ్రామాభివృద్ధి పేరిట ఏర్పడిన ఈ వీడీసీలు తమ లక్ష్యం విస్మరించి తీర్పులు, తీర్మానాలు చేయడంతోపాటు ఆదాయం సమకూర్చడంపై దృష్టి సారిస్తున్నాయి. గ్రామ ఐక్య త, అభివృద్ధే ఎజెండా ముసుగులో ఏర్పాటయ్యే వీడీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తమ కు అడ్డుచెప్పేవారిని మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా వేధిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నా యి. మానేరు, చెరువుల్లో ఇసుక, మట్టి నిల్వలుఉన్న గ్రామాల్లో అధిపత్యం చేలాయిస్తున్నాయి. వీటికి వేలం నిర్వహించి సొమ్ము చేసుకుంటున్నాయి. వీడీసీల అనుమతితోనే కొన్ని గ్రామాల్లో బెల్ట్‌షాపులకు వేలం వేస్తూ విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారని, వీటిని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ఇదేవిషయంపై పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌ను వివరణ కోరగా.. పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదులు వస్తే బయట పరిష్కరించుకోవాలని బాధితులకు అధికారులు సూచనలివ్వరన్నారు. ఏ వివాదం ఉన్నా చట్ట పరిధిలోనే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
ప్రాణాలు తీస్తున్న పంచాయితీలు
ఠాణాలు, కోర్టుల్లో తేలాల్సినవి పెద్దమనుషుల చెంతకు..
అధికారుల సిఫారసుతోనే ముదురుతున్న వివాదాలు!
భార్యాభర్తల గొడవ ఠాణా మెట్లు ఎక్కింది. బయట పరిష్కరించుకుంటామని ఇద్దరూ పెద్దమనుషులను ఆశ్రయించి మంగళవారం సుగ్లాంపల్లిలో పంచాయితీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాటామాటా పెరిగింది. ఆగ్రహంతో ఊ గిపోయిన ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఇదికాస్త కత్తిపోట్లకు దారీతీసింది. ఈ ఘటనలో గణేశ్, మల్లేశం చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
తన భార్యను వేధిస్తున్నాడనే కారణంతో అప్పన్నపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని మరోవ్యక్తి ఇటీవల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు పిలిచాడు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పాడు. ఇది నమ్మిన అవతలి వ్యక్తి మార్కెట్‌కు రాగానే.. ఆహ్వానించిన వ్యక్తి.. తన భార్య ఎదుటనే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

పల్లెపెద్ద పెత్తనం