ఇంధనం కరువు | - | Sakshi
Sakshi News home page

ఇంధనం కరువు

May 13 2025 12:06 AM | Updated on May 13 2025 12:06 AM

ఇంధనం కరువు

ఇంధనం కరువు

● జనవరి నుంచి పెట్రోల్‌, డీజిల్‌ బిల్లులు పెండింగ్‌ ● పోలీసు వాహనాలకు డీజిల్‌ కరువు ● కరీంనగర్‌ కమిషనరేట్‌లో రూ.కోటికిపైగా బిల్లులు ● సిరిసిల్ల, రామగుండంలో రూ.40 లక్షల చొప్పున బాకీ ● వాహన మెయింటెనెన్స్‌ బిల్లులు కూడా రావడంలేదు ● మూడు నెలలుగా రాని స్టేషన్‌ నిర్వహణ బడ్జెట్‌

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

తెలంగాణ పోలీసులు సాంకేతికత, కేసుల దర్యాప్తు విషయంలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలుస్తున్నారు. ఈ విషయం ఇటీవల మరోసారి రుజువైంది. కానీ, కొన్నినెలలుగా పోలీసులకు సమయానికి నిధులు అందడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసు వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బిల్లులు జనవరి నుంచి పెండింగ్‌లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్‌ పెట్రోల్‌ బిల్లులతోపాటు వాహనాల మరమ్మతులకు సంబంఽధించి మెయింటెనెన్స్‌ బిల్లులు కూడా రావడం లేదని వాపోతున్నారు. స్టేషన్‌ మెయింటెనెన్స్‌కు సంబంధించి అర్బన్‌, రూరల్‌ ఏరియాల్లో నెలనెలా కొంత మొత్తం అందజేస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పలువురు ఎస్‌హెచ్‌వోలు వాపోతున్నారు.

గరిష్టంగా కరీంనగర్‌లో

ఉమ్మడి కరీంనగర్‌జిల్లాలో కరీంనగర్‌, రామగుండం కమిషనరేట్లు, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. కరీంనగర్‌ కమిషనరేట్‌ బిల్లులు జనవరి నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రతీ నె లా రూ.25 లక్షలకుపైగా నిధులు కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన కరీంనగర్‌ కమిషనరేట్‌లోనే దాదాపు రూ.కోటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సిరిసిల్ల లోనూ గత నాలుగు నెలలుగా బిల్లులు రావడం లేదని సమాచారం. అక్కడా దాదాపు రూ.40 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని సిబ్బంది వాపోతున్నారు. రామగుండంలో ఏప్రిల్‌ నెలకు సంబంధించి రూ.40 లక్షలు మాత్రమే బిల్లులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. జగిత్యాలలో ఎలాంటి సమస్య లేదని స్పష్టంచేశారు. అంతా బానే ఉందని పైకి చెబుతున్న యూనిట్లలోనూ వాస్తవాలు వేరే ఉన్నాయని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. వాహనాల మరమ్మతుల డబ్బులు సకాలంలో విడుదల కాకపోవడంతో మెయింటెనెన్స్‌కు ఇబ్బందిగా ఉంటుందని పలువురు పోలీసు అధి కారులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమైన సందర్భాల్లో తమ చేతుల నుంచి డీజిల్‌ పోయించుకుంటున్నామని వాపోతున్నారు.

మెయింటెనెన్స్‌కు తిప్పలే..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని రెండు కమిషనరేట్లు, రెండు ఎస్పీ కార్యాలయాల్లో స్టేషన్‌ మెయింటెనెన్స్‌ డబ్బులు మూడు నెలలుగా రావడం లేదని సమాచారం. ప్రాంతాన్ని బట్టి అర్బన్‌, రూరల్‌ ఏరియాలకు ప్రతీ నెలా స్టేషనరీ, తదితర మెమెంటెనెన్స్‌కు కొంతమొత్తం రావాల్సి ఉంటుంది. వీటిని స్టేషనరీతోపాటు వచ్చిన వారికి టీ, కాఫీల కోసం వినియోగిస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పోలీసు అధికారులు వాపోతున్నారు. దీంతో పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. చాలాసార్లు తామే తొలుత చేతి నుంచి ఖర్చు చేసి, బిల్లులు వచ్చాక సర్దుబాటు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యూనిట్‌ వాహనాలు

కరీంనగర్‌ 380

రామగుండం 168

జగిత్యాల 242

సిరిసిల్ల 211

(నోట్‌: వాహనాల సంఖ్యలో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement