
బుద్ధుని బోధనలు అనుసరణీయం
ఎలిగేడు/జూలపల్లి: గౌతమ బుద్ధుని బోధనలు మానవాళికి అనుసరణీయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సోమవారం బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని ఎలిగేడు మండలం ధూళికట్ట, జూలపల్లి మండలం వడుకాపూర్ గ్రామాల పరిధిలోని బౌద్ధ స్తూపం వద్ద బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పంచశీల జెండా ఎగురవేసి మాట్లాడారు. మనిషి తన కోరికలను తగ్గిస్తేనే శాంతి, సౌభ్రాతృత్వం, ప్రకృతి, మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు. బుద్ధుని పంచశీలాలు, అష్టాంగామార్గాలు, దశపారమితలు ఆచరిస్తేనే ప్రపంచశాంతి ఉంటుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు. ధూళికట్ట, వడుకాపూర్ నుంచి బౌద్ధ స్తూపం వద్దకు వచ్చేందుకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, బుద్ధ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దేవ శ్రీనివాస్ తన మరణానంతరం సదాశయ ఫౌండేషన్ ద్వారా అవయవదానం చేసేందుకు అంగీకార పత్రాన్ని ఎమ్మెల్యే సమక్షంలో అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు బాలుసాని పరుశరాములుగౌడ్, మొగురం రమేశ్, నాగభూమి బుద్ధ విహార్ గౌరవ సలహాదారు పుల్లయ్య కాంబ్లే, విండో డైరెక్టర్ పోల్సాని పుల్లారావు, అర్షనపల్లి వెంకటేశ్వర్‌రావు, సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు భీష్మాచారి, ఆకుల మహేందర్, కోండ్ర సంతూ, పాటకుల భూమయ్య, మానుమండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే విజయరమణారావు