
‘ఎర్లీబర్డ్’కు స్పందన
● బల్దియాకు రూ.9.7కోట్ల ఆదాయం ● వెనుకబడిన మూడు మున్సిపాలిటీలు ● రామగుండం కార్పొరేషనే అగ్రస్థానం
కోల్‌సిటీ(రామగుండం): ఎర్లీబర్డ్ ఆఫర్‌కు రామగుండం బల్దియాలో అనూహ్య స్పందన లభించింది. ఇదేసమయంలో పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఆశించిన స్థాయిలో ముందస్తు ఆస్తిపన్ను వసూలు కాలేదు. ఈనెల 7వ తేదీతో ఐదు శాతం రాయితీ ఆఫర్ గడువు మగిసింది. ఎర్లీబర్డ్ ఆఫర్‌తో రామగుండం బల్దియాకు రూ.9.7కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు ప్రకటించారు. ఏటా ఎర్లీబర్డ్ ఆఫర్‌తో బల్దియా లక్ష్యం నిర్దేశించుకుంటోంది. ఈ ఏడాది కూడా సుమారు రూ.4కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉందని భావించినా.. అంతకుమించి వసూలైంది. ప్రతీఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఎర్లీబర్డ్ ఆఫర్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఆఫర్ కింద ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి 5 శాతం రిబెట్ వర్తింపజేస్తోంది.
ప్రథమ స్థానంలో రామగుండం..
ఎర్లీబర్డ్ ఆఫర్ కింద ఆస్తిపన్ను వసూలు చేయడంలో రామగుండం నగరపాలక సంస్థ ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో పోల్చితే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో ఆస్తిపన్ను చెల్లించిన వారికి ఆస్తిపన్ను మొత్తంలో 5శాతం రాయితీ ప్రకటిస్తూ ప్రభుత్వం గత ఏప్రిల్ మొదటి వారంలో ఎర్లీబర్డ్ ఆఫర్ ప్రకటించింది. దీని గడువు తొలుత ఏప్రిల్ 30తో ముగిసినా.. ప్రజల అభ్యర్థన మేరకు ఈనెల 7వ తేదీ వరకు పొడిగించింది. గడువు ముగిసిసే సమయానికి రామగుండం బల్దియా 47.91 శాతం ఆస్తిపన్ను వసూలు చేసింది. రాష్ట్రంలోని 151 పట్టణ స్థానిక సంస్థల్లో 4వ స్థానంలో నిలిచింది.
రూ.9.7కోట్ల ఆస్తిపన్ను వసూలు..
రామగుండం నగరంలో 51,033 అసెస్‌మెంట్లు ఉండగా, మొత్తం ఆస్తిపన్ను డిమాండ్ రూ.19.14 కోట్ల వరకు ఉంది. ఇందులో 13,915 అసెస్‌మెంట్ల నుంచి రూ.9.7 కోట్ల వరకు ఆస్తిపన్ను వసూలైంది. నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష, కమిషనర్‌గా వ్యవహరిస్తున్న అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అరుణశ్రీ ఎప్పటికప్పుడు పన్ను వసూళ్ల పురోగతి సమీక్షిస్తూ, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. దీంతో స్వల్ప వ్యవధిలోనే బల్దియా ఈ ఘనత సాధించిందని రెవెన్యూ విభాగం అధికారులు వెల్లడిస్తున్నారు.
మూడు మున్సిపాలిటీల్లో పూర్..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు ఆశించినస్థాయిలో ఆస్తిపన్ను వసూలు చేయలేకపోయాయి. పెద్దపల్లిలో 12,451 అసెస్‌మెంట్లు ఉండగా, రూ.8.02కోట్ల డిమాండ్ ఉంది. ఇందులో రూ.1.70 కోట్ల వరకు వసూలు కాగా 21.20 శాతం నమోదైంది. సుల్తానాబాద్‌లో 5,511 అసెస్‌మెంట్లు ఉంటే.. రూ.3.06కోట్ల డిమాండ్ ఉండగా, రూ.57లక్షల వరకు వసూలు చేసి 18.63 శాతం, మంథనిలో 5,203 అసెసెస్‌మెంట్లకు రూ.2.3కోట్ల డిమాండ్ ంటే.. రూ.58 లక్షలు వసూలు చేసి 25.37 శాతం నమోదు చేశాయి.
సకాలంలో చెల్లించండి
జిల్లా ప్రజలు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి బల్దియాల అభివృద్ధికి సహకరించండి. జూన్ ఆఖరులోగా ఆస్తిపన్ను చెల్లించకపోతే జూలై నుంచి వడ్డీ పెరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా ఆస్తిపన్ను చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో భాగంగానే ఎర్లీబర్డ్ ఆఫర్‌లో రామగుండం బల్దియా మంచి ఫలితం సాధించింది.
– అరుణశ్రీ, కమిషనర్, అదనపు కలెక్టర్
ఎర్లీబర్డ్ ఆఫర్ వసూళ్ల తీరు
బల్దియా అసెస్మెంట్లు డిమాండ్ కలెక్షన్ శాతం (రూ.కోట్లలో)
రామగుండం 51,033 19.14 9.7 47.91
పెద్దపల్లి 12,451 8.02 1.70 21.20
సుల్తానాబాద్ 5,511 3.06 0.57 18.63
మంథని 5,203 2.3 0.58 25.37

‘ఎర్లీబర్డ్’కు స్పందన