ప్రాణం తీసిన మామిడికాయలు | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన మామిడికాయలు

May 4 2025 6:23 AM | Updated on May 4 2025 6:23 AM

ప్రాణం తీసిన మామిడికాయలు

ప్రాణం తీసిన మామిడికాయలు

చెట్టు పైనుంచి పడి వృద్ధుడు మృతి

గోదావరిఖని: మామిడికాయలు తెంపడానికి చెట్టెక్కి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. గోదావరిఖని వన్‌టౌన్‌ ఎస్సై రమేశ్‌ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని చంద్రశేఖర్‌నగర్‌లో నివాసముంటూ వండ్రంగి పనులు చేస్తున్న నాగవెల్లి బాలయ్య(70).. శనివారం ఉదయం తన ఇంటి వెనకాల ఉన్న మామిడి కాయలు తెంపడానికి చెట్టు ఎక్కాడు. కర్రతో కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెట్టు పైనుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా బాలయ్య మార్గమధ్యంలో మృతి చెందాడు. బాలయ్యకు భార్య నాగవెల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

రోడ్డుప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పింఛన్‌ డబ్బు కోసం బ్యాంక్‌కు వస్తే, వాహనం ఢీకొని ఓ వృద్ధుడు ప్రాణాపాయ స్థితికి చేరాడు. స్థానికుల వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన వృద్ధుడు రమావత్‌ బాల్య పింఛన్‌ డబ్బుల కోసం గొల్లపల్లిలోని బ్యాంక్‌కు వచ్చాడు. రోడ్డు దాటుతుండగా కామారెడ్డి నుంచి వస్తున్న మహారాష్ట్రకు చెందిన బొలెరో వాహనం వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాల్య అపస్మారక స్థితికి వెళ్లాడు. 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్‌

గోదావరిఖని(రామగుండం): గోదావరిఖని ప్రశాంత్‌నగర్‌లో చీమల తిరుపతిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ రమేశ్‌ తెలిపిన వివరాలు.. 2021లో ప్రశాంత్‌నగర్‌కు చెందిన బండారి మొగిలి హత్య కేసులో చీమల తిరుపతి, రాగుల రాజశేఖర్‌, బోనగిరి రాకేశ్‌ నిందితులు. బెయిల్‌పై విడుదలయ్యారు. కేసు ట్రయల్‌కు వస్తుందని రాజీ పడదామని ప్రధాన నిందితుడు తిరుపతిని రాజశేఖర్‌, రాకేశ్‌ కోరారు. అందుకు తిరుపతి ఒప్పుకోలేదు. తిరుపతిని హత్య చేస్తే గతంలోని హత్య కేసు నుంచి తప్పించుకోవచ్చని నిర్ణయించుకున్నారు. ఈనెల 2న తిరుపతి నడుపుతున్న ఆన్‌లైన్‌ సెంటర్‌కు రాజశేఖర్‌, రాకేశ్‌ వెళ్లి అతడిపై కత్తులతో దాడిచేసి పారిపోయారు. శనివారం నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement