● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం ● జిల్లా కేంద్రంలో విస్తృత పర్యటన
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని సఖి కేంద్ర భవనం ప్రారంభించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. నూతనంగా నిర్మించిన సఖి కేంద్ర భవనాన్ని పరిశీలించారు. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల మరమ్మతులపై ఆరా తీశారు. బండారికుంటలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రం, జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షల కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రి, మాతాశిశు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. యూఆర్‌ఎస్‌లో వసతులు, ఆహార నాణ్యతను పరిశీలించారు. మానసిక దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వ సాయం గురించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ తీరుపై ఆయన ఆరా తీశారు.
పాత భవనం కూల్చివేయండి
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నూతన భవనాన్ని నిర్మించుకునేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న పాత భవనం కూల్చే పనులు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. పాత ఆస్పత్రిలోని ఇన్‌పే షెంట్లను కొత్తగా నిర్మించిన 42 పడకల ఆస్పత్రికి తరలించాలని సూపరింటెండెంట్ శ్రీధర్‌కు సూచించారు. పేషెంట్లకు అందిస్తున్న ఆహారనాణ్యతను పరిశీలించారు. ఆవరణను శుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూవో వేణుగోపాల్, ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
10 నుంచి శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్
గ్రామ పంచాయతీల్లో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు పారిశుధ్యం నిర్వహణపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. మైదానాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించకుండా శుభ్రం చేయాలన్నారు. పిచ్చి మొక్కలను తొలగించాలని, డ్రైనేజీలను శుభ్రం చేయాలన్నారు. పల్లెప్రకృతివనం, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, నర్సరీ, క్రీడాప్రాంగణాలు శుభ్రం చేయాలని సూచించారు. దోమల నియంత్రణకు ఫాగింగ్ చేపట్టాలని ఆయన అన్నారు. మాంసాహారం విక్రయించే దుకా ణాల్లో నాణ్యమైన మాంసం అందేలా చూడాలన్నారు. తాగునీటి సరఫరా పైప్‌లైన్ లీకేజీలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వాటర్‌టాంకుల్లో క్లోరినేషన్ చేసి తాగు నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.