ముస్తాబాద్(సిరిసిల్ల): ‘అమ్మ..నాన్న.. మూడు నెలలైతే బీటెక్ పూర్తవుతుంది. ఉద్యోగం వస్తుంది..’ అని చె ప్పిన మాటలు మరువకముందే ఆ కొడుకు వారికి దూరమయ్యాడు. ఒక్కగా నొక్క కొడుకు కేరళలో దుర్మరణం చెందగా.. ముస్తాబాద్‌లో విషాదం అలుముకుంది. కొడుకుపై పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు జలసమాధి అయ్యాయి. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ముత్యాల దేవేందర్, శారద దంపతులకు ముత్యాల సాయిచరణ్(21) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. నలుగురు స్నేహితులతో కలిసి సాయిచరణ్ కేరళలోని అలప్పుజకు ఈనెల 3న వెళ్లారు. అక్కడ సముద్రంలో హౌస్‌బోట్‌లో వెళ్తుండగా సాయిచరణ్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఈతకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు దేవేందర్, శారదలు రెండు రోజులుగా కుమారుడు సాయిచరణ్ కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీప బంధువు కాగా, ఆయన దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ప్రభుత్వ విప్ అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడి సాయిచరణ్ మృతదేహాన్ని రప్పించేలా ఏర్పాట్లు చేశారు. యువకుడి మృతదేహం ఇంటికి చేరగానే తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. ‘సాయి లేరా.. బిడ్డా..’ అంటూ ఆ తల్లి రోదనలు అక్కడ ఉన్న వారికి కంటతడి పెట్టించాయి.
కేరళలో బీటెక్ విద్యార్థి దుర్మరణం
ముస్తాబాద్‌లో విషాదం
ఆశలు సమాధి