● స్థానిక సంస్థలకు పాత రిజర్వేషన్ల పద్ధతిన ఎన్నికలు నిర్వహించడమా? అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణ చేపట్టి, బీసీ రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించడమా?అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కులగణన కోసం ఇంటింటి సర్వే చేపట్టి బీసీల వివరాలను బీసీ కమిషన్ ప్రభుత్వానికి అందజేయాడినికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ నివేదికను సర్కారు ఆమోదించి, రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు చాలాసమయం పడుతుంది. మరోవైపు.. ప్రస్తుత రిజర్వేషన్లు పెంచి బీసీలకు 50శాతం ఇవ్వాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేస్తున్నాయి. రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
వివరాలు అందజేత
స్థానిక సంస్థలకు మూడు పర్యాయాలు అమలు చేసిన రిజర్వేషన్ల వివరాలతో పాటు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, స్టేషనరీ తదితర వివరాలను పంచాయతీరాజ్‌శాఖ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇటీవల అందజేశారు. అయితే, ఎన్నికల నిర్వహణపై తమకు ఆదేశాలు రాలేదని, ఆదేశాలు వస్తే నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు.