
గోదావరిఖని: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల పక్రియ పూర్తయ్యింది. ఈక్రమంలో సోమవారం హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎల్‌సీ సమావేశం నిర్వహించనున్నారు. ఈమేరకు అన్ని యూనియన్ల నాయకులు, సింగరేణి యాజమాన్యానికి ఇప్పటికే లేఖలు పంపించారు. ఈనెల 27న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈమేరకు కార్మిక నేతలు నేడు హైదరాబాద్ తరలివెళ్తున్నారు. ఈసమావేశంలో యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులు, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు భేటీ కానున్నారు. సంస్థ వ్యాప్తంగా ఉన్న 11ఏరియాల్లో 39,600మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, రహస్య బ్యాలెట్ పద్ధతిన సంస్థలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు వచ్చేనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎల్‌సీ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈమేరకు ఈనెల 4న సీఎల్‌సీ కార్యాలయంలో హాజరు కావాలని 13కార్మిక సంఘాలు, సింగరేణి యాజమాన్యానికి లేఖ రాశారు. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా, ఎన్నికల విధివిధానాలు ఖరారు చేయనున్నారు. గతంలో ఉన్న పద్ధతి ప్రకారం గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం లెక్కన ఎన్నికలు నిర్వహిస్తారా? లేక ఈసారి మార్చుతారా? అనే విషయం తేలాల్సి ఉంది. రెండు ఓట్ల పద్ధతిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలను కార్మికులు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన ఎన్నుకుంటారు. ఇప్పటివరకు అసెంబ్లీ వేడితో కార్మిక క్షేత్రం బిజీగా మారగా, గుర్తింపు ఎన్నికల పక్రియకు ముందడుగు పడనుంది.
నేడు డిప్యూటీ సీఎల్‌సీ వద్ద సమావేశం
27న కార్మిక సంఘాల ఎన్నికలు