
ఓటుహక్కు వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేయిస్తున్న అధికారులు(ఫైల్)
● గత ఎన్నికలకన్నా తగ్గిన పోలింగ్ శాతం ● 2018లో 71.94 శాతం నమోదు ● 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 68.71 శాతం నమోదు ● నెలపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించినా నిష్ప్రయోజనం ● స్వీప్ అధికారుల్లో అంతర్మథనం ● ఉన్నతాధికారులతో సమీక్షకు అవకాశం
జ్యోతినగర్(రామగుండం): రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెంచేందుకు సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం(స్వీప్) చేపట్టిన విస్తృత అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వలేకపోయాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 71.94 శాతం పోలింగ్ నమోదు కాగా దానిని మరింత పెంచాలని లక్ష్యంగా పనిచేశారు. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 3శాతం తగ్గి 68.71 శాతంగా న మోదు కావడం అధికార వర్గాల్లో విస్మయం కలిగించింది. పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
పట్టించుకోని ఓటర్లు..
అసెంబ్లీ ఎన్నికల క్రమంలో నెలరోజుల నుంచి స్వీప్ కార్యక్రమం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రతీరోజు ప్రత్యేక కళా బృందాలతో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకోకపోవడంతోనే పోలింగ్ శాతం తక్కువగా నమదు అయినట్లు సమాచారం.
అవగాహన కార్యక్రమాలు..
ఓటు ప్రాముఖ్యత, ఓటరు స్లిప్ పొందే విధానం, జాబితాలో తమ పేరు పరిశీలన, ఓటరు గుర్తింపు కార్డు, నాయకుల ప్రలోభాలకు లొంగకుండా సమర్థుడిని ఎన్నికల్లో ఎన్నుకోవాలని, కార్మికులకు, యువతకు, పరిశ్రమల్లోని కాంట్రాక్టు కార్మికులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఓటు విలువ, ప్రాముఖ్యతపై వివరించారు. అయినా ఓటర్లు పూర్తిస్థాయిలో తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు.
వలస వెళ్లిన వారి పేర్లు తొలగించక..
రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, బసంత్‌నగర్, సింగరేణి సంస్థలు ఉన్నాయి. వీటిలో విధులు నిర్వహించే వారు ట్రాన్స్‌ఫర్ కావడం, ఉద్యోగ విరమణ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడం, రెండు ప్రాంతాల్లో ఓటు నమోదై ఉండడం, అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రమంతా ఒకేరోజు ఉండటంతో చాలామంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లోనే ఓటు వేసినట్లు తమ స్వస్థలాలకు తరలివెళ్లిన తెలుస్తొంది. దీంతోనే రామగుండంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడానికి ఇవి కూడా కారణమని భావిస్తున్నారు.
ఉత్సాహం చూపిన గ్రామీణ ఓటర్లు..
గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. ఉదయం నుంచే పోలింగ్ మందకొడిగా సాగింది. పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని గ్రామాల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పల్లెవాసులు ఉత్సాహం చూపడం విశేషం. నియోజకవర్గంలో 2,21,019మంది ఓటర్లుండగా, 1,51,865 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో 68.71శాతం పోలింగ్ నమోదైంది. అంతర్గాం మండలంలో అత్యధికంగా 82శాతం, పాలకుర్తి మండలంలో 81శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. రామగుండం మండలంలోని పారిశ్రామిక ప్రాంతంలో పోలింగ్ 65.65శాతం నమోదు కావడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. అయితే, గ్రామాల్లో పోలింగ్ శాతం పెరగడం, పట్టణాల్లో తగ్గడం ఎవరిపై ప్రభావం చూపుతుందోననే అంచనాలు మొదలైయ్యాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమ గెలుపై ధీమాతో ఉన్నారు. నియోజకవర్గ ఓటర్లు ప్రతీసారి విలక్షణ తీర్పు ఇస్తుండటంతో ఈసారి ఎవరివైపు మొగ్గుచూపుతారోనని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.
ప్రత్యేక దృష్టి పెట్టాం
రామగుండం నియోజకవర్గం పరిధిలో ఎన్నికలలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదయ్యేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయ్యేలా స్వీప్ ద్వారా అన్నివర్గాలను చైతన్య పర్చాం. నెలపాటు సమావేశాలు, ర్యాలీలు, సదస్సులు నిర్వహించాం. ఓటరు చైతన్య రథం, కళాజాత, కళాకారుల సేవలు వినియోగించాం. గ్రామీణ, పట్టణ, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి ఓటర్లను నేరుగా కలుసుకున్నాం. ఓటుహక్కు ప్రాముఖ్యత గురించి వివరించాం. దీనిద్వారా కలిగే ప్రయోజనాలు, ఓటువేయకుంటే కలిగే నష్టాల గురించి కూడా వివరించాం. అయినా, పోలింగ్ శాతం తక్కువ నమోదైంది. ఇందుకు ప్రధాన కారణం కొందరికి రెండుచోట్ల ఓటుహక్కు ఉండడం, మరికొందరు వలస వెళ్లడమని భావిస్తున్నాం. దీనిపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షిస్తాం. – స్వరూపరాణి, స్వీప్ నోడల్ అధికారి, రామగుండం

