కాగితంపై మెరిసిన పీ–4 | - | Sakshi
Sakshi News home page

కాగితంపై మెరిసిన పీ–4

Mar 31 2026 8:44 AM | Updated on Mar 31 2026 8:44 AM

ఆశయం ఘనం.. ఆచరణలో శూన్యం..

పార్వతీపురం రూరల్‌: పేదరికం లేని సమాజమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించిన పీ – 4 కార్యక్రమం తొలి ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో సోమవారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మంటపంలో నిర్వహించిన వార్షికోత్సవంలో వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి , స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొని పథక లక్ష్యాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.5 లక్షల మంది పీ–4కు నమోదు చేసుకోగా, 5 లక్షల మందికి లబ్ధి చేకూరిందని ప్రజాప్రతినిధులు, అధికారులు వెల్లడించారు. జిల్లాలో 78,464 బంగారు కుటుంబాలను గుర్తించి, వారికి 2,998 మంది మార్గదర్శకులను అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆచరణలో అడ్డంకులు..

ప్రభుత్వ ఆశయాలు కాగితంపై ఆకర్షణీయంగా కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అమలు తీరుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం స్వల్ప సాయంతో నిరుపేద కుటుంబాల తలరాతలు మారుతాయా? అన్న ది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో పారిశ్రామికవేత్తల కొరత ఉండడంతో ఇతర నగరాల నుంచి దాతలను తీసుకురావడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు రావాలని కోరడం వంటి అంశాలు అధికారులకు సవాలుగా మారింది. వ్యవస్థాగతమైన మార్పుల కంటే వ్యక్తిగత ఉదారతపైనే ఈ పథకం ఎక్కువగా ఆధారపడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సొంత సేవకే ప్రభుత్వ ముద్ర?

ఈ వేడుకలో సన్మానాలు పొందిన దాతల్లో అత్యధికులు చాలా కాలంగా తమ సొంత ఖర్చులతో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నవారే కావడం గమనార్హం. జిల్లేళ్లమూడి అమ్మ సేవా సమితి, డాక్టర్‌ అప్పలనాయుడు వంటి వ్యక్తులు, సంస్థలు ఎప్పటి నుంచో చేస్తున్న నిరంతర సేవలను ఇప్పుడు ప్రభుత్వం తన ఖాతాలో పీ – 4 పేరిట వేసుకునే ప్రయత్నం చేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కంటే దాతల వ్యక్తిగత సేవే ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తోందని, ఆశించిన స్థాయిలో మార్పు రావాలంటే మరిన్ని పటిష్ట చర్యలు అవసరమని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

దాతలకు సత్కారం..

విజయనగరం అర్బన్‌: పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పీ – 4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకోవడంతో సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాలకు సహకరించిన దాతలకు అధికారులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో హోమ్‌ మినిస్టర్‌ వంగలపూడి అనిత, కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి, సీపీఓ బాలాజీ, కొప్పుల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ అప్పలనాయుడు పాల్గొన్నారు.

గణాంకాలు చెబుతున్న వాస్తవం

జిల్లాలో 83,436 బంగారు కుటుంబాలను గుర్తించగా వాటిలో కేవలం 19,410 కుటుంబాలను మాత్రమే తొలి ఏడాది దత్తత తీసుకోవడం జరిగింది. అంటే మెజారిటీ కుటుంబాలు ఇప్పటికీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. మార్గదర్శులు సంఖ్య 2,897 మాత్రమే ఉండడం కూడా కార్యక్రమ విస్తరణలో లోపాలను సూచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement