ఆస్తి కోసం ఘాతుకం.. | - | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం ఘాతుకం..

Mar 31 2026 8:44 AM | Updated on Mar 31 2026 8:44 AM

అన్నలపై దాడి చేసిన తమ్ముడు

ఒకరి పరిస్థితి విషమం

పరారీలో నిందితుడు

బొండపల్లి: ఆస్తి వివాదంలో తోడబుట్టిన అన్నలపై దాడి చేశాడో ప్రబుద్ధుడు. చాకుతో హత్యాయత్నానికి పాల్పడడంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని కొండకిండాంలో సోమవారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై యు.మహేస్‌, గ్రామస్తులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కలిశెట్టి రామునాయుడు, చిన్నప్పలమ్మలకు ముగ్గురు కుమారులు సత్యనారాయణ, బంగారునాయుడు, గౌరునాయుడు ఉన్నారు. రామునాయుడు పది సంవత్సరాల కిందట చనిపోగా, చిన్నప్పలమ్మ ఐదు సంవత్సరాల కిందట కన్నుమూసింది. అప్పటి నుంచి తల్లి చిన్నప్పలమ్మకు సంబంధించిన భూమితో పాటు బంగారం విషయమై అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కూడా అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుండగా.. గౌరినాయుడు క్షణికావేశంలో చాకుతో అన్నదమ్ములపై దాడి చేశారు. పెద్ద అన్నయ్య సత్యనారాయణ కడుపులో పొడవంతో పేగులు బయటకు రాగా.. రెండో అన్నయ్య బంగారునాయుడు ఛాతిపై పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. బంగారునాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒకరి పరిస్థితి విషమం..

గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని దాడిలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ, బంగారునాయుడులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్లూస్‌టీమ్‌ సభ్యులు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement