తక్షణమే చర్యలు
విజయనగరం క్రైమ్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని డీటీసీ డీఎస్పీ వీరకుమార్ అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి, 31 వినతులు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు సంబంధించినవి 10, కుటుంబ కలహాలకు సంబంధించినవి 2, మోసాలకు సంబంధించినవి 3, ఇతర అంశాలకు సంబంధించిన 16 ఫిర్యాదులున్నాయి. అనంతరం డీఎస్పీ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, ఏడు రోజుల్లో చర్యలు తీసుకోవాలన్నారు. వాటి వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపాలని సూచించారు. కార్యక్రమంలో కంట్రోల్ రూమ్ సీఐ వైకుంఠరావు, ఎస్సై ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిది అర్జీల స్వీకరణ..
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తొమ్మిది అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో ఏఎస్పీ నేరుగా మాట్లాడి..సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ..ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వాటి నివేదికలను జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


