మహిళా సాధికారతకు ‘మన్యం’ దిక్సూచి | - | Sakshi
Sakshi News home page

మహిళా సాధికారతకు ‘మన్యం’ దిక్సూచి

Mar 9 2026 7:38 AM | Updated on Mar 9 2026 7:38 AM

అలరించిన ‘థింసా’

జిల్లాలో 8వేల మంది కొత్త పారిశ్రామికవేత్తలు

రూ. 447.25 కోట్ల రుణాల పంపిణీ

కలెక్టర్‌ డా. ప్రభాకరరెడ్డి

పార్వతీపురం రూరల్‌: ప్రతి ఇంట్లోనూ ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని, ఆర్థిక స్వతంత్రతతోనే మహిళలకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురంలోని ఒక ప్రైవేట్‌ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కంటే అధికంగా 8వేల మంది మహిళలు కొత్తగా పారిశ్రామికవేత్తలుగా నమోదు చేసుకోవడం గర్వకారణమన్నారు. ఆడపిల్లలను కనీసం డిగ్రీ వరకు చదివించాలని, నెలకు రూ.10–20 వేల ఆదాయం సంపాదించే స్థాయికి చేరాకే వివాహం చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. మహిళల రక్షణ కోసం ‘శక్తి యాప్‌’, వన్‌స్టాప్‌ సెంటర్లు, ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఇంటి పట్టాలను మహిళల పేరుతో మంజూరు చేయడం వల్ల వారికి సామాజిక భద్రత చేకూరిందని తెలిపారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం చిన్న వ్యాపారులు, సాధారణ మహిళలకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుస్తోందన్నారు. అనంతరం జిల్లాలోని 9,337 స్వయం సహాయక సంఘాల్లోని 62,954 మంది సభ్యులకు రూ. 447,25,00,000/– విలువైన చెక్కును అతిథులు అందజేశారు. అంతకు ముందు డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను కలెక్టర్‌ సందర్శించారు. కార్యక్రమంలో ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, డీఆర్‌ఓ కె.హేమలత, ఐసీడీఎస్‌ పీడీ డా. టి.కనకదుర్గ, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆదివారం మహిళా శక్తి కదం తొక్కింది. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీని కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు సాగిన ఈ ప్రదర్శనలో విద్యార్థినులు, మహిళా పోలీసులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా హక్కులపై నినాదాలు చేశారు. కోలాటాలు, థింసా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి, ఐసీడీఎస్‌ అధికారి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement