డెంకాడ: విజయనగరం – విశాఖ జాతీయ రహదారిపై మండలంలోని అయినాడ జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఎ.సన్యాసినా యుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా ఆనందపురంలో జరగనున్న వాహనాల వేలంలో పాల్గొనేందుకు విజయనగరానికి చెందిన పులప అప్పారావు శనివారం ఉదయం బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో విజయనగరం వస్తుండగా.. రాత్రి 9.30 గంటల సమయంలో అయినాడ జంక్షన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. దీంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భామిని: సతివాడ గ్రామానికి చెందిన పున్నాన తేజ (7) చెరువులో పడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. తేజ తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని కర్ర చెరువు వద్ద ఆటలాడుతూ.. చేపలు పట్టే క్రమంలో చెరువులో దిగారు. ఈక్రమంలో తేజ ప్రమాదవశాత్తూ చెరువులో కూరుకుపోయి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి జయలక్ష్మి బోరున విలపిస్తోంది. చిన్నారి తండ్రి లక్ష్మణరావు కూడా రెండేళ్ల కిందటే మృతి చెందడంతో ఆశలన్నీ కుమారుడిపైనే పెట్టుకుని జయలక్ష్మి జీవిస్తోంది. ఇంతలో ఇలా జరగడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.


