● కలెక్టర్ ప్రభాకరరెడ్డి
సీతంపేట: గిరిజనులు నాటువైద్యం, ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. పీహెచ్‌సీల్లో ఆధునిక వైద్యపరికరాలు, మందులు అందుబాటులో ఉన్నాయని, వైద్యసిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీతంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించారు. ముందుగా సీతంపేటలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇప్పగూడ గ్రామంలో గ్రామముస్తాబును పరిశీలించారు. నూతనంగా నిర్మించిన సవర సాంస్కృతిక భవనాన్ని ప్రారంభించారు. గ్రామాన్ని శ్రమదానంతో సుందరంగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. అనంతరం పర్యాటక ప్రాంతమైన జగతపల్లి వ్యూపాయింట్‌ను సందర్శించారు. అక్కడ రీసార్ట్స్‌ను ప్రారంభించారు. పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకునేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అడ్వంచర్‌పార్కులో ఫ్లవర్ గార్డెన్‌ను ప్రారంభించారు. వివిధ రకాల దేశీ, విదేశీ పుష్పాలతో ముస్తాబైన ఈ గార్డెన్ చూడముచ్చటగా ఉందన్నారు. పర్యాటకుల వినోదం కోసం ఏర్పాటు చేసిన క్వాడ్‌బైక్‌ను నడుపుతూ పార్క్‌లో కలియతిరిగారు. గల్లీదండా క్రీడా, పంచ్‌బ్యాగ్, గానుగరాట్నంను ప్రారంభించారు. కార్యక్రమంలో పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్, ఏపీఓ జి.చిన్నబాబు, ఎంపీడీఓ బి.బి మిశ్రో, తహసీల్దార్ శ్రీకన్య, పీహెచ్‌ఓ వెంకటగణేష్, డిప్యూటీ ఈఓ నారాయుడు, సీడీపీఓ సిమ్మాలమ్మ, తదితరులు పాల్గొన్నారు.


