గజపతినగరం రూరల్: మండలంలోని మరుపల్లి గ్రామ సమీపంలో గల పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై కిరణ్‌కుమార్ నాయుడు తెలియజేసిన వివరాల ప్రకారం.. దత్తిరాజేరు మండలం మానాపురం గ్రామానికి చెందిన రౌతు ధనుంజయరావు, రౌతు సాయిశంకర్, రౌతు చంద్రశేఖర్ తమ స్నేహితుడితో కలిసి విజయనగరం వైపు నుంచి మానాపురం కారులో వస్తున్నారు. తెల్లవారుజాము రెండున్నర గంటల సమయంలో మరుపల్లి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రౌతు ధనంజయరావు అక్కడికక్కడే మృతి చెందగా.. సాయిశంకర్, చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే డ్రైవర్‌కు, మరో వ్యక్తిగి పెద్దగా గాయాలు కాలేదు. క్షతగాత్రులిద్దరూ ప్రస్తుతం విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి తండ్రి రౌతు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు


