● విద్యా శాఖ మంత్రిగారూ మా బాధలు పట్టవా..! ● చినమేరంగి పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థుల ఆవేదన
జియ్యమ్మవలస రూరల్:
కటిక నేలపై పడక, తాగునీరు లేక అవస్థలు, చీకటి గదిలో నివాసాలు.. ఇది జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల వసతిగృహంలో విద్యార్థుల దుస్థితి. పిఠాపురం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, పెందుర్తి వంటి సుదూర ప్రాంతాల నుంచి పాలిటెక్నికల్ విద్యను అభ్యసించేందుకు వచ్చిన విద్యార్థులకు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. కళాశాలలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ మూడు బ్రాంచ్‌ల్లో బోధన బాగున్నప్పటికీ వారు ఉండేందుకు సరైన వసతి సౌకర్యాలు లేక మొదటి ఏడాది కళాశాలలో జాయిన్ అయి రెండవ ఏడాది నుంచి వేర్వేరు ప్రాంతాలకు విద్యార్థులంతా వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని కళాశాల అధికారులు, సిబ్బందే చెబుతున్నారు. ఇక్కడ తమకు కనీస వసతులు కూడా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చినమేరంగిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వసతిగృహం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని తలుపులు, కిటికీలు లేకుండా కటిక నేలపై నిద్రిస్తున్నామని వాపోతున్నారు. వసతిగృహాన్ని ఆనుకుని ఉన్న నేల బావి నీరే ఆధారమని, నాచు పట్టిన నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఇక్కడ ఉండాలంటే భయమేస్తుందని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితిని విద్యాశాఖ మంత్రి లోకేష్ కనరా... మా బాధ వినరా... అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా కనీస సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు.


