పార్వతీపురం రూరల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల ఆయుధాలు, సాంకేతిక పరికరాల గురించి విద్యార్థులకు వివరించారు. ఏకే–47, ఇన్సాస్ రైఫిల్స్, ఎస్.ఎల్.ఆర్, పిస్టల్స్, గ్రనేడ్లు, టియర్ గ్యాస్ గన్ వంటి ఆయుధాలతో పాటు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, డ్రోన్ల వినియోగాన్ని ఆర్మీడ్ రిజర్వు సిబ్బంది ప్రత్యక్షంగా చూపారు. నేర పరిశోధనలో కీలకమైన వేలిముద్రల సేకరణ (క్లూస్ టీం), సెల్‌ఫోన్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో సమాచార మార్పిడికి వాడే వీహెచ్‌ఎఫ్ సెట్ల పనితీరుపై అవగాహన కల్పించా రు. నేరస్తులను పట్టుకోవడంలోనూ, బాంబులను గుర్తించడంలోనూ శిక్షణ పొందిన జాగిలాలు (బిందు, జూలీ, చార్లీ, శాండీ) ప్రదర్శించిన విన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. వివిధ పాఠశాలల నుంచి సుమారు 400 మంది విద్యార్థులు, మహిళా పోలీసులు తరలివచ్చారు. ఏఎస్పీ మనీషారెడ్డి, ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి, సీఐ వెంకట్రావు, ఆర్.ఐ లు రాంబాబు, నాయుడు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


