పార్వతీపురం రూరల్ : వినియోగదారులకు నాణ్యమైన సరుకులను తక్కువ ధరలకే అందించడమే లక్ష్యంగా పని చేయాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ ప్రాజెక్టు అధికారి సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆయన పార్వతీపురం పట్టణంలోని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సూపర్ బజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరుకుల నిల్వలు, నాణ్యతను పరిశీలించిన ఆయన, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరపాలని స్పష్టం చేశారు. వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ధరల పట్టికను ప్రదర్శించాలని, తేనె, కాఫీ వంటి గిరిజన ఉత్పత్తుల నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. నిల్వల రిజిస్టర్లను ఎప్పటికప్పుడు తాజాపరుస్తూ, సరుకుల కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జీసీసీ మేనేజర్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


