రాజాం : పట్టణ పరిధి డోలపేట గ్రామానికి సంబంధించిన భూములు ఎన్నో ఏళ్లుగా దేవదాయ శాఖ పరిధిలో ఉండడంతో గ్రామప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శాసనమండలి సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ప్రస్తావించారు. గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో డోలపేట భూముల అంశాన్ని సభాధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్లారు. బొబ్బిలి ఎస్టేట్ ఉద్యోగిగా పనిచేసిన అయ్యగారి పాపయ్య పంతులు 1848లో డోలపేట (అప్పటి సీతారాంపురం అగ్రహారం) గ్రామంలో ఉమామహేశ్వర, లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని నిర్మించారని పేర్కొన్నారు. అయితే 1941 మరియు 1944లలో ఆస్తి రిజిస్టర్ రూపొందించినా ఈ ఆలయం పేరుతో ఎటువంటి భూములు లేవని అందులో పేర్కొన్నారని తెలిపారు. 2002, 2012 సంవత్సరంలో దేవదాయ శాఖ తయారు చేసిన ప్రాపర్టీ రిజిస్టర్లో రైతుల జిరాయితీ భూమి 207.33 ఎకరాలను ఉమామహేశ్వర, లక్ష్మీనారాయణ దేవాలయం పేరున రెవెన్యూ అధికారులు చట్టవిరుద్దంగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి రైతుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అప్పటి బొబ్బిలి సర్వే సెటిల్‌మెంట్ అధికారి రైతులు, ప్రజలతో ఎలాంటి గ్రామసభ నిర్వహించకుండా, రైతులకు తెలియకుండా అనేక దిద్దుబాటులతో చట్టవిరుద్దంగా ఇందులో కొన్ని భూములకు స్వామివారి పేరున పట్టా ఇచ్చారని తెలిపారు. దేవదాయ శాఖ రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈ భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్‌రిజిస్ట్రార్‌కు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్లాన్ అనుమతులు ఇవ్వొద్దని పురపాలక సంఘానికి ఆదేశాలు ఇవ్వడంతో వేల మంది డోలపేట గ్రామప్రజలు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని డోలపేట గ్రామ ప్రజలకు భూములపై సర్వ హక్కులు కల్పించేలా చట్టం తీసుకురావాలని కోరారు.


