పార్వతీపురం రూరల్ : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. పార్వతీపురం పట్టణంలోని భాస్కర, ఆర్.కె.జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న పరీక్షల సరళిని, అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌న్ అమలులో ఉన్నందున బయటి వ్యక్తులు గుంపులుగా ఉండకూడదని ఆదేశించారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై కఠిన నిషేధం అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రశ్న పత్రాల తరలింపు, సమాధాన పత్రాల భద్రత విషయంలో తగిన ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో పార్వతీపురం టౌన్ ఇన్‌స్పెక్టర్ వెంకట్రావుతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


