● కేన్సర్‌పై అప్రమత్తతే ఆయుధం: ఎస్పీ
పార్వతీపురం రూరల్: మహిళా సాధికారిత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్‌లో మహిళా అధికారులు, సిబ్బందికి సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార), బ్రెస్ట్ (స్తన) క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వృత్తిపరమైన సవాళ్లతో పాటు కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకునే మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భాశయ, స్తన క్యాన్సర్ల బారిన పడకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముప్పును నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు. మార్చి 1 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా కేవలం సిబ్బందికే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. శిబిరంలో పాల్గొన్న వైద్యులు డాక్టర్ రజిని ప్రియ, సౌజన్యలు కేన్సర్ వ్యాధులపై సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. ప్రతి మహిళ నెలకు ఒకసారి స్వీయ స్తన పరీక్ష చేసుకోవాలని, అవసరమైతే మెమోగ్రఫీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శిబిరంలో సివిల్, ఏఆర్, డీపీవో, కమ్యూనికేషన్ విభాగాలకు చెందిన మహిళా సిబ్బందితో పాటు హోంగార్డులు, నాలుగో తరగతి ఉద్యోగులు పరీక్షలు చేయించుకున్నారు. అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, పట్టణ సీఐ వెంకట్రావు, ఏఆర్ ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


