● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి
పార్వతీపురం రూరల్: ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదుకూ సత్వర పరిష్కారం చూపడమే అధికారుల లక్ష్యం కావాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తితో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి సమస్యలను స్థానికంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రతి అధికారీ జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ఫిర్యాదులు అత్యంత సున్నితమైనవని, వాటిని నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీదారుడి సమస్య క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. మొత్తం 106 అర్జీలు రాగా అందులో రెవెన్యూ విభాగానికి సంబంధించినవి 50, ఇతర శాఖలకు చెందినవి 56 ఫిర్యాదులున్నాయని తెలిపారు.


