చెంతనే ప్రమాదం.. | - | Sakshi
Sakshi News home page

చెంతనే ప్రమాదం..

Mar 3 2026 7:31 AM | Updated on Mar 3 2026 7:31 AM

చెంతనే ప్రమాదం.. చూస్తూ ఊరుకుందామా!

వేట్లపాలెం ఘటనతో ఆలస్యంగా మేల్కొన్న అధికారులు బాణసంచా విక్రయ దుకాణాలకు నోటీసులు ఇటీవలే పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద పేలిన మందుగుండు సామగ్రి

భద్రతా ప్రమాణాలు

పాటించకుంటే చర్యలు

సాక్షి, పార్వతీపురం మన్యం:

కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 20 మందికిపైగా మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. బాణసంచా తయారీదారులు, విక్రేతలు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల తరచూ ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతేడాది దీపావళి సమయంలో విజయ నగరం నుంచి వస్తున్న బస్సులో పెద్ద ఎత్తున బాణసంచాను పార్సిల్‌ చేసి తరలించారు. పార్వతీపురం బస్‌ కాంప్లెక్స్‌లో వీటిని దించుతుండగా.. ప్రమా దం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. జిల్లాలో ఈ తరహా బాణసంచా ప్రమాదాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. వేట్లపాలెం దుర్ఘటన తర్వా త తీరిగ్గా మేల్కొన్న అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. మన జిల్లాలోనూ అగ్నిమాపక శాఖ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన శాఖాధికారులు పలు దుకాణాల వద్ద పరిశీలించగా.. అనేక లోపాలు వెలుగు చూశాయి.

విక్రయ కేంద్రాలకు నోటీసులు...

జిల్లాలో తయారీ కేంద్రాలు లేనప్పటికీ.. విజయ నగరంలోని హోల్‌సేల్‌ వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేసి, ఇక్కడ విక్రయిస్తుంటారు. దీపావళి సమయంలో నేరుగా శివకాశి తదితర ప్రాంతాల నుంచి తెప్పిస్తుంటారు. నిబంధనల ప్రకారం బాణసంచా విక్రయ కేంద్రాల వద్ద ఫైర్‌ ఎగ్జిట్‌ డోర్స్‌, ఇసుక బస్తాలు, నీటి డ్రమ్ములు అందుబాటులో ఉండాలి. చాలా వరకు దుకాణాల వద్ద ఇటువంటివేవీ అమలు కాని పరిస్థితి. అధికారుల తనిఖీల సమయంలోనూ ఇటువంటి లోపాలను గుర్తించారు. పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామంలోని అగ్ని గంగమ్మ ఫైర్‌వర్క్స్‌, పాచిపెంట మండలం శ్యామలగౌరీపురం గ్రామంలోని అమూల్యమేఘన ఫైర్‌ వర్క్స్‌, సీతానగరం మండలం సుభద్ర గ్రామంలోని రుగుడ పోలమాంబ ఫైర్‌ వర్క్స్‌లకు నోటీసులు జారీ చేశారు.

మందుగుండు తయారీదారులు, విక్రేతలు భద్రతా ప్రమాణాలు పాటించాలి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలు సీజ్‌ చేస్తాం. పండగల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అనుమతి లేని ప్రదేశాల్లో బాణసంచా నిల్వచేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవు. ప్రజలు కూడా బాణసంచా వినియోగ సమయంలో జాగ్రత్తలు పాటించాలి.

– సింహాచలం, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement