మెరుగైన వైద్యం అందని ద్రాక్షేనా...! | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందని ద్రాక్షేనా...!

Mar 2 2026 7:35 AM | Updated on Mar 2 2026 7:35 AM

మెరుగ

మెరుగైన వైద్యం అందని ద్రాక్షేనా...!

పేదవాడి ప్రాణాలతో చెలగాటం

నిపుణులు లేరు.. స్కానింగ్‌ లేదు!

పార్వతీపురం రూరల్‌/పార్వతీపురం : మన్యం జిల్లాలో ప్రజలకు సంజీవనిలా నిలవాల్సిన పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి నేడు అరకొర సౌకర్యాలతో, సమస్యల వలయంలో చిక్కుకుంది. నాడు కార్పొరేట్‌ హంగులతో మెరిసిన ఈ వైద్యాలయం, నేడు పాలకుల నిర్లక్ష్యంతో అరకొర వసతులకు నిలయంగా మారి ఉన్న వనరులతో ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన ఆస్పత్రుల నిర్వహణ సమన్వయ అధికారులకు నిర్వహణ కత్తి మీద సాముల మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ఆస్పత్రికి అనుసరించి నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ మల్టీ సుపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ భవనం, వైద్య కళాశాల పనులు అటకెక్కడంతో పాటు, దానికి అనుబంధంగా ఉన్న ఈ ఆస్పత్రిని గాలికొదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకే పడక.. ఇద్దరు రోగులు!

కేంద్ర ఆస్పత్రికి రోగుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. రోజువారీ ఓపీ దాదాపుగా సీజనల్‌ వ్యాధుల కాలంలో 450 మార్కును తాకుతుండగా, ఇన్‌ పేషంట్ల సంఖ్య సామర్థ్యానికి మించిపోతోంది. ఆస్పత్రిలో ఉన్నవి 150 పడకలే అయినా, ప్రస్తుతం దాదాపుగా 286 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో వేరే దారి లేక ఒకే పడకపై ఇద్దరు రోగులను సర్దుబాటు చేయాల్సిన దుస్థితి. కిటకిటలాడే వార్డులు, కనీసం కూర్చోవడానికి సరిపడా కుర్చీలు లేక నేలపైనే పడిగాపులు కాస్తున్న రోగుల దృశ్యాలు ఇక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి.

ఫ్యామిలీ డాక్టర్‌ మాయంతో.. పెరిగిన భారం

గత ప్రభుత్వంలో ఇంటి ముంగిటకే వైద్యం అందించిన ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం అటకెక్కడం ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నాడు గ్రామ క్లినిక్‌లలోనే 105 రకాల మందులు, 14 రకాల పరీక్షలు అందుబాటులో ఉండేవి.

నేడు ప్రాథమిక దశలో వైద్యం అందకపోవడంతో ప్రతి చిన్న సమస్యకు రోగులు జిల్లా ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. గతంలో లబ్ధి చేకూర్చిన ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఇకనైనా స్పందించి, ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఆస్పత్రిలో మౌలిక వసతులను మెరుగుపరచాలని మన్యం ప్రజలు కోరుతున్నారు.

మా నాయకుడు గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించాలనే సంకల్పంతో మా ప్రభుత్వ హయాంలోనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, వైద్య కళాశాలను మంజూరు చేశాం. నిధుల కేటాయింపుతో పాటు స్థల సేకరణ పూర్తి చేసి, దాదాపు 60 శాతం నిర్మాణ పనులు కూడా పూర్తి చేశాం. కానీ, నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ పనులను గాలికొదిలేసింది. గతంలో ఫ్యామిలీ డాక్టర్‌, ఆరోగ్య సురక్ష వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రజల ముంగిటకే వైద్యం అందేది. ఇప్పుడు ఆ వ్యవస్థలను నిర్వీ ర్యం చేయడం వల్లే జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగి రోగులు అల్లాడుతున్నారు.

– మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, పార్వతీపురం

ఆస్పత్రికి వెన్నెముక లాంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండటం రోగుల పాలిట శాపంగా మారింది. సివిల్‌ సర్జన్‌ (ఆర్‌.ఎమ్‌.ఓ), రేడియాలజీ, మైక్రో బయాలజీ, ఈఎంటీ వంటి విభాగాల్లో నిపుణులు లేక సేవలు కుంటుపడ్డాయి. అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ విభాగం తాళం వేసి ఉండటంతో, నిరుపేదలు ప్రైవేట్‌ సెంటర్లకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అత్యవసర స్థితిలో వచ్చిన వారిని సైతం విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకు రిఫర్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఖాళీగా ఉన్న కీలక పోస్టులు

ఉన్న 150 పడకలకు 280 మంది ఇన్‌ పేషంట్లు

సీజనల్‌ వ్యాధుల కాలంలో అయితే అవస్థలు

మెరుగైన చికిత్సకు తప్పని రిఫరల్‌ గండం

నాడు రక్షణ కవచంలా ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం

మెరుగైన వైద్యం అందని ద్రాక్షేనా...! 1
1/2

మెరుగైన వైద్యం అందని ద్రాక్షేనా...!

మెరుగైన వైద్యం అందని ద్రాక్షేనా...! 2
2/2

మెరుగైన వైద్యం అందని ద్రాక్షేనా...!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement