మన్యం అటెన్షన్..!
● వేడెక్కుతున్న వాతావరణం
● మన్యంలో పెరుగుతున్న జ్వరపీడితులు
● నమోదవుతున్న వైరల్, మలేరియా, టైఫాయిడ్ కేసులు
● కిటకిటలాడుతున్న ఏరియా ఆసుపత్రి
సీతంపేట: వేసవి ప్రారంభమైంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని వేడెక్కుతోంది. ఒక్కసారిగా తీవ్ర చలి నుంచి ఎండ వేడిమి వచ్చేసింది. ఏజెన్సీలో వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో వైరల్, టైఫాయిడ్ జ్వరాలు పెరుగుతున్నాయి. మలేరియా పీవీ, పీఎఫ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. వెరసీ మన్యంలో జ్వర పీడితుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు జ్వరాలతో వైద్యం కోసం వెళ్లే వారి సంఖ్య అధికమౌతుంది. స్థానిక ఏరియా ఆస్పత్రిలో బెడ్‌లు సైతం నిండిపోతున్నాయి. రక్త పరీక్షల్లో 60 శాతం టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడే ఈ తరహా జ్వరాలు ఉంటే రానున్న మరో రెండు నెలలు ఎండలు కాసే ప్రమాదమున్నందున ఇంకా జ్వరపీడితులు సంఖ్య పెరుగుతుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. దోమల కారక మలేరియా పాజిటివ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. గత సంవత్సరం సీతంపేట ఏజెన్సీలోని హైరిస్క్ గ్రామాల్లో 300లకు పైగా మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో రోజుకు ప్రాంతీయ ఆస్పత్రికి వెళ్లిన వారిలో ఒకటి, రెండు మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. చాపకింద నీరులా మలేరియా పాజిటివ్ వ్యాపిస్తుండడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
ప్రబలుతున్న వ్యాధుల పట్ల అలర్ట్‌గానే ఉన్నాం. వ్యాధులన్నింటికీ తగిన మందులు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే వారికి తగిన వైద్య సేవలు అందిస్తున్నాం. వచ్చిన రోగులకు రక్త పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారణ చేసి అవసరమైన మందులు ఇస్తున్నాం. అన్ని రకాల సేవలకు స్పెషలిస్టు వైద్యులు ఉన్నారు. అవసరమైన రోగులను ఇన్‌పేషంట్లుగా ఆస్పత్రిలోనే ఉంచుతున్నాం.
– బి.శ్రీనివాసరావు, సీతంపేట,
ఏరియా ఆస్పత్రి సూపరెంటెండెంట్
మన్యం అటెన్షన్..!
మన్యం అటెన్షన్..!


