సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో అదరగొట్టారు.. | - | Sakshi
Sakshi News home page

సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో అదరగొట్టారు..

Mar 1 2026 7:37 AM | Updated on Mar 1 2026 7:37 AM

సైనిక

సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో అదరగొట్టారు..

శృంగవరపుకోట: సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో దొగ్గపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వజ్రపు శశికుమార్‌, చుక్క శశాంక్‌, తొత్తడి రిషిత సత్తా చాటి అర్హత సాధించినట్టు హెచ్‌ఎం సురేష్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిని హెచ్‌ఎంతో పాటు ఇతర ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. ఇదిలా ఉండగా వీరికి అదే పాఠశాలకు చెందిన నాగుబిల్లి ప్రసాద్‌ శిక్షణ ఇవ్వగా హెచ్‌ఎం సురేష్‌, సహోపాధ్యాయిని ఆర్‌.సాయిగీత సహకరించారు.

డ్రంకన్‌ డ్రైవ్‌ కేసుల్లో రూ.4.30లక్షల జరిమానా

విజయనగరం క్రైమ్‌ : మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విధిస్తూ విజయనగరం అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ తేజ చక్రవర్తి తీర్పు ఇచ్చినట్టు ఇన్‌చార్జ్‌ ఎస్పీ మహేశ్వరరెడ్డి శనివారం తెలిపారు. విజయనగరం ట్రాఫిక్‌ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ పోలీసులు డీడీలపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. మద్యం సేవించి, వాహనాలు నడిపిన వారిపై 43 కేసులు నమోదు చేశారు. వీరికి విజయనగరం అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వద్ద హాజరు పరచగా ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున మొత్తం 43 మందికి రూ.4.30 లక్షల జరిమానా విధించారని తెలిపారు.

ఇంటర్‌ పరీక్షల్లో ఒకరిపై మాల్‌ప్రాక్టీస్‌ వేటు

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం (బాటనీ, హిస్టరీ) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని 33 కేంద్రాల్లో మొత్తం 5,257 మంది విద్యార్థులకుగాను 5,066 మంది (96.3%) హాజరు కాగా, 191 మంది గైర్హాజరయ్యారు. జనరల్‌ విభాగంలో 2,615 మంది, వృత్తి విద్యా విభాగంలో 2,451 మంది పరీక్ష రాశారు. పాలకొండ డివిజన్‌ పరిధిలోని భామిని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రంలో హిస్టరీ–2 పరీక్ష రాస్తూ అక్రమాలకు పాల్పడిన ఒక విద్యార్థి మాల్‌ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు, పకడ్బందీ తనిఖీల మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

మార్చి 14 నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు

పార్వతీపురం రూరల్‌ : రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ క్రీడా పోటీలు మార్చి 14 నుంచి 29 వరకు వివిధ జిల్లాల్లో నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డా. కె.శ్రీధర్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు శాప్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. అథ్లెటిక్స్‌ పోటీలు మార్చి 14, 15 తేదీల్లో గుంటూరు డీఎస్‌ఏ మైదానంలో 40 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులకు నిర్వహిస్తారని, బ్యాడ్మింటన్‌ పోటీలు మార్చి 21, 22 తేదీల్లో కోనసీమ డీఎస్‌ఏ స్టేడియంలో 35 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులకు, 45 ఏళ్లు పైబడిన పురుషులకు జరుగుతాయని తెలిపారు. టెన్నిస్‌ పోటీలు మార్చి 28, 29 తేదీల్లో విజయనగరం డీఎస్‌ఏ స్టేడియంలో 35, 45 ఏళ్లు పైబడిన పురుషులకు నిర్వహిస్తారని, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ముందే(హెచ్‌టిటిపిఎస్‌://స్పోర్ట్స్‌.ఏపి.జిఓవి.ఇన్‌//రిజిస్ట్రేషన్‌/శాప్‌–లీగ్‌–రిజిస్ట్రేషన్‌) వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుని, నేరుగా పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. ఇతర వివరాలకు 7396423490 నంబరును సంప్రదించాలని సూచించారు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

శృంగవరపుకోట: మద్యానికి బానిసైన వ్యక్తి భార్య మందలించిందని మనస్తాపానికి గురై తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్‌.కోట సీఐ నారాయణమూర్తి శనివారం తె లిపారు. పట్టణానికి చెందిన చుక్క శ్రీను(45) మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. శుక్రవారం మద్యం తాగి ఇంటికొచ్చిన శ్రీను భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడని, ఎంతకూ బయటకు రాకపోవడంతో భార్య సత్యవతి ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు విరగ్గొట్టి చూడగా శ్రీను ఫ్యాన్‌కు చీరతో ఉచి వేసుకొని మృతి చెందినట్టు కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో అదరగొట్టారు.. 1
1/2

సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో అదరగొట్టారు..

సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో అదరగొట్టారు.. 2
2/2

సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలో అదరగొట్టారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement