సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం : ఎస్పీ
పార్వతీపురం రూరల్ : పోలీసు సిబ్బంది సంక్షేమానికి, వారి ఆరోగ్య, శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది తమ వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులను ఎస్పీకి విన్నవించుకున్నారు. సిబ్బంది నుంచి విజ్ఞాపనలను స్వీకరించిన ఎస్పీ, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా అనారోగ్య కారణాలు, బదిలీలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చాయని, వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేలా సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్‌ఐ నాయుడు, సీసీ సంతోష్‌కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


