రోడ్డు ప్రమాదంలో ఆర్మీ మాజీ హవల్దార్ మృతి
గజపతినగరం : మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ హవల్దార్ తాలాడ గోపాలరావు(70) విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కొన్నాళ్లుగా విశాఖపట్నం అక్కిరెడ్డిపాలెంలో నివాసం ఉంటున్న గోపాలరావు పనుల నిమిత్తం బీహెచ్‌వీ వైపు వెళ్లారు. మార్గమద్యలో జీవీఎంసీ చెత్త లోడు లారీ వెనుక భాగం నుంచి గోపాలరావు స్కూటీని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించినట్టు చెప్పారు. గోపాలరావుకు భార్య రమణమ్మతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.


