అదే నిర్లక్ష్యం..
కురుపాంలో మరోసారి కలవరం
గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విదార్థినులకు అస్వస్థత
పలువురికి డయేరియా లక్షణాలు
సాక్షి, పార్వతీపురం మన్యం:
గిరిజన విద్యార్థుల చదువుల ‘సంక్షేమం’పై నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఏదో ఒక ఘటన జరిగితే స్పందించడం... తర్వాత దానికి శాశ్వత పరిష్కారం చూపకుండా మిన్నకుండడం పరిపాటిగా మారింది. ఈ నిర్లక్ష్యధోరణే ఇప్పుడు కురుపాంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో మరోసారి కలకలం రేపింది. ఆరో తరగతి చదువుతున్న మండంగి హేమలత, కోలక అనసూయ, పొదిలాపు నవిత, కొండగొర్రె అనుశ్రీ, ఆరిక ప్రణవి, జుహితా దేవి తదితరులు కడుపు నొప్పి, వాంతులతో శుక్రవారం కురుపాం సీహెచ్‌సీలో చేరారు. వీరిలో కొందరికి డయేరియా లక్షణాలు ఉండడంతో వైద్యసేవలు అందిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఇదే పాఠశాల లో పచ్చ కామెర్లు ప్రబలాయి. ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. వందలాదిగా కామెర్లతో కురుపాం ఆస్పత్రితో పాటు.. జిల్లా ఆస్పత్రి, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స కూడా పొందారు. మరలా ఇదే పాఠశాలలో డయేరియా వ్యాప్తి చెందడంతో తల్లిదండ్రులు ఆందోళనకు లోనయ్యారు.
ఆశ్రమ పాఠశాలలో తాగునీటి నాణ్యత, ఆహార పరిశుభ్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే పాఠశాలలో వందల సంఖ్యలో విద్యార్థులు పచ్చ కామెర్ల బారిన పడ్డారు. తాగునీటి కలుషితం, అధ్వానం పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాల లేమి ఇందుకు కారణమని అంతా భావించారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం.. అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవ్వడంతో నీటి నమూనాలను పరీక్షకు కూడా పంపారు. ఇప్పటికీ దాని నివేదికను అధికారులు బహిర్గతం చేయలేదు. వైఎస్సార్ సీపీ నాయకుల ఫిర్యాదు మేరకు జాతీయ ఎస్టీ కమిషన్ కూడా విచారణకు వచ్చి, వెళ్లింది. తర్వాత ఎటువంటి సమాచారం.. ఘటన పట్ల నిరక్ష్యం వహించిన వారిపై చర్యలు.. మృతుల కుటుంబాలకు పరిహారం వంటివేవీ కానరాలేదు. హడావిడిగా ఆర్వో ప్లాంటు, చేతి బోరు మారుస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్పారు. ఇప్పటికీ ఎటువంటి చర్యలూ లేవు. విద్యార్థులకు భరోసా కల్పించేలా నేటికీ అక్కడ సౌకర్యాలు కల్పించకపోవడంపై అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది.
ఇటీవల ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో ఘటనలు జరిగిన తర్వాత.. లోపలికి ఎవరినీ రానీయవద్దని, ముఖ్యంగా మీడియాను అనుమతించకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కురుపాంలో విద్యార్థుల అస్వస్థత విషయంలోనూ ఇదే ధోరణి పాటించారు. బాలికల అస్వస్థతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో... కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో డయేరియా సోకినట్టు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని పాఠశాల అధికారుల పేరిట శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలకు చెందిన ఎం. హేమలత, కె.అనసూయ, కె.అనుశ్రీ, ఎ.ప్రణవి, జుహితా దేవి అనే విద్యార్థినులు స్వల్పంగా విరేచనాలతో ఇబ్బంది పడ్డారని.. అంతకుమించి ఎవరికీ వాంతులు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని వివరణ ఇచ్చారు.
ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి విచారణకు ఆదేశించగా... ఆ మేరకు పార్వతీపురం గిరిజన సంక్షేమ అధికారి విచారణ చేపట్టారని, విద్యార్థినులు జాతర నుంచి తమ తల్లిదండ్రులు తీసుకువచ్చిన పచ్చళ్లు, ఖర్జూరాలను తినడం వల్ల తాత్కాలికంగా కడుపు ఉబ్బరానికి గురైనట్లు తేలిందని చెప్పుకొచ్చారు. పాఠశాలలోని ఆర్వో ప్లాంట్ సక్రమంగా పనిచేస్తోందని, విద్యార్థులందరూ శుద్ధి చేసిన నీటినే తాగుతున్నారని తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీటి వనరులు సంతృప్తికరంగా ఉన్నాయని వారికి వారే ఆ ప్రకటనలో సర్టిఫికెట్ ఇచ్చుకోవడం గమనార్హం. సాధారణంగా ఇటువంటి ఘటనల్లో అధికారులు ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. ఇక్కడ మాత్రం ‘పాఠశాల అధికారులు’ పేరిట వివరణ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.
కురుపాం: కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు తరుచూ అనారోగ్యంపాలవుతున్నారని, సమగ్ర విచారణ జరిపి సదుపాయాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డయేరియా లక్షణాలతో కురుపాం సీహెచ్‌సీలో వైద్యసేవలు పొందుతున్న బాలికలను పరామర్శించారు. అనారోగ్య కారణాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గత ఐదు రోజులుగా పలువురు విద్యార్థులు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారని, దీనికి అసలు కారణాలు తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అదే నిర్లక్ష్యం..
అదే నిర్లక్ష్యం..


