గట్టు గుట్టు ఎవరికెరుక! | - | Sakshi
Sakshi News home page

గట్టు గుట్టు ఎవరికెరుక!

Feb 28 2026 7:36 AM | Updated on Feb 28 2026 7:36 AM

గట్టు

గట్టు గుట్టు ఎవరికెరుక!

గట్టు గుట్టు ఎవరికెరుక! ● అసెంబ్లీలో ఒక మాట.. పురంలో మరో ‘ఆట’! ● నెల్లి చెరువు స్థలాన్ని గతంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు కేటాయింపు ● ఇప్పుడు అదే చెరువు స్థలాన్ని వ్యర్థాలతో పూడ్చివేత ● వారి స్థలాన్ని కప్పివేయడంపై అవాక్కయిన క్రీడాధికారులు

● అసెంబ్లీలో ఒక మాట.. పురంలో మరో ‘ఆట’! ● నెల్లి చెరువు స్థలాన్ని గతంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు కేటాయింపు ● ఇప్పుడు అదే చెరువు స్థలాన్ని వ్యర్థాలతో పూడ్చివేత ● వారి స్థలాన్ని కప్పివేయడంపై అవాక్కయిన క్రీడాధికారులు

సాక్షి, పార్వతీపురం మన్యం:

జిల్లా కేంద్రంలోని నెల్లి చెరువు ఆక్రమణల గుట్టు మలుపులు తిరుగుతోంది. ఓ వైపు చెరువుల ను పరిరక్షించాలని స్థానిక ఎమ్మెల్యే విజయ్‌చంద్ర అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నారు. మరోవైపు వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత తహసీల్దార్లదేనని కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి అంటున్నారు. ఎవరికి వారు ప్రకటనలిస్తుండగానే..నెల్లి చెరువు గట్టును మున్సిపల్‌ యంత్రాంగం కప్పేస్తోంది. వ్యర్థాలతో నింపేస్తోంది. ఇది పరోక్షంగా కబ్జాలకు ఊతమివ్వడమేనన్న విమర్శ లు వ్యక్తమవుతుండగానే... ఆ స్థలం తమదంటూ జిల్లా క్రీడాధికారులు ముందుకు రావడం.. నెల్లి చెరువు గట్టు స్థలాన్ని పరిశీలించడం గమనార్హం.

అప్పట్లోనే క్రీడా స్టేడియానికి కేటాయింపు..

పార్వతీపురం పట్టణంలోని సర్వే నంబర్‌ 401లో 11.54 ఎకరాల విస్తీర్ణంలో నెల్లి చెరువు హద్దు ఉంది. దాదాపు 3.78 ఎకరాల్లో అటవీ శాఖ అతిథిగృహం, అటవీ అధికారి క్వార్టర్స్‌, రైతు బజారు, ఐసీడీఎస్‌ కార్యాలయం, మెహర్‌బాబా ఆలయం, యోగా జ్ఞానఆశ్రమం, వృద్ధాశ్రమం, కొంత ప్రైవేట్‌ వ్యక్తుల ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 7.76 ఎకరాల్లో 5.57 ఎకరాల స్థలాన్ని క్రీడా స్టేడియానికి ప్రతిపాదించారు. ఇది ఆయకట్టు లేని చెరువుగా నిర్ధారిస్తూ.. 2016–17లోనే అప్పటి తహసీల్దారు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అప్పట్లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో క్రీడా వికాస కేంద్ర(స్పోర్ట్‌ కాంప్లెక్స్‌)కు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన జీవోనూ జారీ చేశారు. తర్వాత ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈలోగా చెరువు గట్టు నిండా ఆక్రమణలు జోరందుకున్నాయి. కొత్తగా ఇళ్ల నిర్మాణాలు సైతం ఊపందుకున్నాయి. వాస్తవానికి చెరువులను రక్షించే బాధ్యత రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీ/మున్సిపల్‌ అధికారులదే. వీరికి హద్దులను నిర్ణయించి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఆక్రమణల నుంచి కాపాడటం, పూడిక తీయడం, నీటి వనరులను కాపాడటం ద్వారా చెరువులను రక్షించవచ్చు. ఎవరికి వారు తమకు సంబంధం లేదన్నట్లుగా ఉండిపోవడంతో గట్టు అంతా ఆక్రమణలతో నిండిపోయి, సుమారు 5 ఎకరాలకే పరిమితమైంది.

చెరువుల పరిరక్షణ సమితి ఆందోళన

కొద్దిరోజులుగా పట్టణంలోని డంపింగుయార్డు రీసైక్లింగ్‌ వ్యర్థాలను మున్సిపల్‌ అధికారుల సూచనలతోనే సంబంధిత కాంట్రాక్టరు నెల్లి చెరువు స్థలంలో పారబోస్తున్నారు. దీన్ని స్థానికులు అడ్డుకున్నా వినిపించుకునే పరిస్థితి లేకపోయింది. ప్రస్తుతం గట్టు మొత్తాన్ని ఆ వ్యర్థాలతోనే నింపేస్తున్నారు. గాజు పెంకులు, వాడి పడేసిన సిరంజిలు, సూదులు ఉంటున్నాయని స్థానిక నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి వనరులున్న చెరువును ఇలా ఆక్రమణలపాల్జేయడం సబబు కాదని చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సంబంధిత స్థలాన్ని పరిశీలించి, అధికారుల తీరును ఎండగట్టారు. ఇదే సమయంలో జిల్లా క్రీడా శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. తమకు కేటాయించిన స్థలాన్ని ఎలా చదును చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే జరుగుతుందా? అని చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో ఒక మాట.. ఇక్కడ చేస్తున్నది మరొకటని విమర్శిస్తున్నారు.

గట్టు గుట్టు ఎవరికెరుక! 1
1/1

గట్టు గుట్టు ఎవరికెరుక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement