గొలుసు దొంగతనాల కేసుల్లో నిందితుడి అరెస్టు
● రూ.29 లక్షల విలువైన బంగారం
స్వాధీనం
పార్వతీపురం రూరల్: జిల్లాలో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.29 లక్షల విలువైన 192 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పార్వతీపురం పట్టణానికి చెందిన కొయ్యపు గిరి రాజశేఖర్ విలాసాలకు, బెట్టింగ్‌లకు బానిసై చెడు వ్యసనాలకు అలవాటు పడి, ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలకు పాల్పడేవాడు. సీసీ టీవీ పుటేజీలు, కాల్ డేటా విశ్లేషణ ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. బుధవారం ఉదయం సీతానగరం మండలం గుచ్చిమి జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో నిందితుడు జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 గొలుసు దొంగతనాలు చేసినట్టు అంగీకరించాడు. వీటిలో సీతానగరం, వీరఘట్టం, చినమేరంగి, గరుగుబిల్లి, పాలకొండ, బలిజిపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలోని కేసులు ఉన్నాయి. కేసును ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించిన రూరల్ సర్కిల్, ఎస్బీ, ఐటీ కోర్, క్రైమ్ బృందాలను ఎస్పీ అభినందించారు.
గొలుసు దొంగతనాల కేసుల్లో నిందితుడి అరెస్టు


