ఒత్తిడికి గురయ్యే వైద్య విద్యార్థులను గుర్తించాలి
● ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్
చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్
విజయనగరం ఫోర్ట్: ఒత్తిడికి గురియ్యే వైద్య విద్యార్థులను ముందుగా గుర్తించి వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలను బుధవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్య విద్యార్థులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వైద్య విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఒకపై అటువంటి పరిస్థితి రాకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమాజంలో కొత్త కొత్త జబ్బులు వ్యాప్తి చెందుతున్నాయని, వీటిపై వైద్య విద్యార్థులు పరిశోధన చేయాలన్నారు. వైద్య రంగంలో వచ్చే ఆధునాతన సాంకేతిక పద్ధతులు గురించి వైద్య విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం నుంచి బేసిక్ లైఫ్ సపోర్టుపై వైద్య విద్యార్థులకు చెప్పాలన్నారు. అనంతరం వైస్ చాన్సలర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎం.జయచంద్రనాయుడు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేవీమాధవి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లోక్‌నాధ్, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తదితరులు పాల్గొన్నారు.


