కాళ్లపారాణి ఆరకముందే...
● రైలు నుంచి జారిపడి నవదంపతులు మృతి
గరుగుబిల్లి: కాళ్లపారాణి ఆరకముందే వారిపై విధి కన్నెర్ర చేసింది. రైలు ప్రమాదం రూపంలో కాటేసింది. అందని లోకాలకు తీసుకుపోయి రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన కోరాడ సింహాచలం(25), జియ్యమ్మవలస మండలం అంకవరం వాసి భవానీ (19)కి ఈ ఏడాది అక్టోబర్ 22న పెళ్లి జరిగింది. అనంతరం జీవనోపాధి కోసం హైదరాబాద్ వెవెళ్లారు. కొద్దిరోజుల అనంతరం అక్కడ నుంచి విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌లో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. యాదాద్రి జిల్లా వంగపల్లి దాటిన తరువాత బోగి డోరు వద్ద నిలబడిన ఇద్దరు ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఏమైందో తేరుకొనేలోపే ఆ ఇద్దరు దంపతులు అనంతలోకాలకు చేరారు.
మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన రావుపల్లికి తరలించారు. నవదంపతులిద్దరూ మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండగకు వచ్చి తమను పలకరిస్తారని ఎదరుచూస్తూ భావించిన కుటుంబ సభ్యులు.. వారి మృతదేహాలను చూసి కన్నీరుకార్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదన మధ్య శనివారం అంత్యక్రియలు జరిపారు.
కాళ్లపారాణి ఆరకముందే...


