ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దాం
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారుద్దామని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ, ఇతర శాఖల అధికారులతో ఆయన శనివారం సమీక్షించారు. మార్కెట్‌లు, దుకాణాలు, గ్రామ వారపు సంతల్లో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ అధికంగా ఉంటుందన్నారు. దీనివల్ల డ్రైనేజీలు పూడుకు పోవడంతోపాటు పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ప్లాస్టిక్ నిషేదంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీ అపరాద రుసుం విధించాలన్నారు. ప్లాస్టిక్ తయారీ యూనిట్లపై నిఘా పెంచాలని కోరారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.హేమలతో పాటు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


