ఏమైనట్టు..?
నిధుల ఖర్చుపై బిల్లులు అడిగారు
ఒక్క రూపాయి కూడా అందలేదు..
రూ.కోటి
నిధులు
విజయనగరం ఫోర్ట్: యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం విజయనగరం జిల్లాకు రూ.కోటి నిధులు మంజూరు చేసింది. ఆ నిధులను ఆయుష్‌శాఖకు కేటాయించామని, ఖర్చుల వివరాలు తెలియజేయాలంటూ ఆ శాఖ కమిషనర్ నుంచి ఆయుష్ వైద్యులకు తాజాగా లేఖ అందింది. దీనిని చూసిన వైద్యులు బిక్కమొహం వేశారు. అసలు ఒక్క రూపాయి కూడా చేతికి అందజేయకుండా... రూ.కోటి విడుదల చేశామని, లెక్కలు చెప్పాలని కోరడంపై ఆవేదన చెందుతున్నారు. నిధులు అందలేదంటూ తిరిగి లేఖ రాశారు. అయితే... యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు అంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరైనట్టు ఆయుష్‌శాఖలో పనిచేస్తున్న హోమియో, ఆయుర్వేద వైద్యులకు, యోగాంధ్ర కో ఆర్డినేటర్‌కు తెలియకపోవడం గమనార్హం. ఆయుష్ శాఖకు మంజూరు చేసినట్టు చెబుతున్న రూ.కోటి నిధులు ఎక్కడకు మళ్లాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
చేతిచమురు వదిలించుకున్న ఆయుష్ వైద్యులు
యోగాడే సందర్భంగా ఈ ఏడాది జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిజిల్లాకు నిధులు కేటాయించింది. విజయనగరం జిల్లాకు కూడా రూ.కోటి నిధులు విడుదల చేసింది. అయితే, ఆ నిధులు ఆయుష్‌శాఖకు చేరకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా రూ.కోటి నిధులు ఎవరు దారి మళ్లించారన్న అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న వైద్యులు సైతం దీనిపై విస్మయం చెందుతున్నారు. కార్యక్రమం నిర్వహణకు చేతిసొమ్ము ఖర్చుచేశామని, నిధులు విడుదల అంశమే తెలియదని చెబుతున్నారు.
యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు జిల్లాకు రూ.కోటి నిధులు మంజూరు చేశారు. ఈ నిధుల ఖర్చుకు సంబంధించిన బిల్లుల వివరాలు కమిషనర్ అడిగారు. మాకు ఒక్కరూపాయి కూడా రాలేదని కమిషనర్‌కు తెలియజేశాం. మా చేతి డబ్బులే రూ.20 వేలు వరకు ఖర్చుచేశాం.
– జి.వరప్రసాద్, సీనియర్ హోమియో వైద్యుడు
యోగాంఽధ్ర కార్యక్రమం నిర్వహణకు విడుదల చేసిన నిధులపై ఖర్చుల వివరాలు ఆయుష్‌శాఖ కమిషనర్ అడిగారు. మాకు రూపాయి కూడా రాలేదని రాసిచ్చేశాం.
– డాక్టర్ ఎం.ఆనందరావు,
యోగాంధ్ర కో ఆర్డినేటర్
యోగాంధ్ర నిర్వహణకు విజయనగరం జిల్లాకు రూ.కోటి నిధులు విడుదల
ఖర్చుచేసిన నిధులకు వివరాలు అందజేయాలని ఆయుష్‌శాఖ వైద్యులకు కమిషనర్ లేఖ
ఒక్కరూపాయి కూడా నిధులు రాలేదని కమిషనర్‌కు తిరిగి లేఖరాసిన ఆయుష్ వైద్యులు
ఆ నిధులు ఏమయ్యాయి?
జిల్లాలో జోరుగా సాగుతున్న చర్చ


